Apr 14,2021 21:27

న్యూఢిల్లీ : హరిద్వార్‌లో కుంభమేళా ఈ నెల 30వరకు కొనసాగుతుందని, కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున త్వరగా ముగించే అంశంపై చర్చలు జరగలేదని అధికారులు బుధవారం చెప్పారు. రెండు వారాలు ముందుగా ముగించాలన్న ప్రతిపాదనేదీ కూడా తమ వద్ద లేదని స్పష్టం చేశారు. కుంభమేళాను రద్దు చేయడంపై ఇప్పటివరకు మత పెద్దలను ఒప్పించలేకపోయారు. దాంతో ఉత్తరాఖండ్‌ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోందని వార్తలు వచ్చాయి. కుంభమేళా సందర్భంగా పవిత్ర గంగానదిలో స్నానాలు ఆచరించేందుకు వందలు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు. దీంతో కొవిడ్‌ కేసుల ఉధృతి మరింత పెరుగుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో సాధువులు, భక్తులు ప్రధాన ఘాట్‌ హర్‌ కి పౌరి వద్ద 'సాహి స్నాన్‌ లేదా రాయల్‌ బాత్‌'కి వెళ్లారు. కుంభమేళాలో అత్యంత పవిత్ర దినంగా భావించే ఈ రోజున మధ్యాహ్నం 2గంటలకు దాదాపు 9.43,452మంది భక్తులు సాన్నాలు చేశారు. రద్దీగా లేని ఘాట్‌ల వద్ద భౌతిక దూరం పాటించని వారికి జరిమానా వేస్తున్నామని, కానీ రద్దీగా వుండే ప్రధాన ఘాట్ల వద్ద కిక్కిరిసిన జనాలకు జరిమానా వేయడం కష్టసాధ్యంగా వుందని పోలీసు అధికారి సంజరు గుంజాయల్‌ వ్యాఖ్యానించారు. మరో ముఖ్యమైన రోజు ఈ నెల 27న వుంది. ఆ రోజున కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నారు.