Mar 05,2021 16:59

జైపూర్‌ : కుమార్తె దళిత యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నదని కన్నతండ్రే గొంతుకోసి చంపేశారు. ఆమెకు పోలీసుల భద్రత ఉన్నా హత్యకు గురికావడం గమనార్హం. ఈ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... దౌసా జిల్లాకు చెందిన శంకర్‌లాల్‌ సైనీ (50), కుమార్తె పింకీ సైనీ (18) దళిత యువకుడైన రోషన్‌ మహావర్‌ని పెళ్లి చేసుకున్నదని తండ్రి కూమార్తెని మందలించారు. అయితే మూడు రోజుల తర్వాత ఫిబ్రవరి 21న రోషన్‌ మహావర్ తో పింకీ ఇంటి నుంచి పారిపోయింది. తండ్రి శంకర్‌లాల్‌.. కుమార్తె పారిపోయిన మరుసటిరోజే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌పి అనీల్‌ బెనివాల్‌ తెలిపారు. కాగా, కుమార్తె, తండ్రి భయానికి గురై.. వారికి ప్రాణ రక్షణ కల్పించాలంటూ ఫిబ్రవరి 26న హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా వారి జీవితం ప్రమాదంలో ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే వారికి పోలీసు భద్రతను కల్పించడంతోపాటు.. వారిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లమని పోలీసులను ఆదేశించింది.
దంపతులిద్దరూ సొంత ఊరికి మార్చి 1న తిరిగి వచ్చారు. కుటుంబ సభ్యులు పింకినీ ఇంటికి తీసుకెళ్లారు. మార్చి 3న బుధవారం తెల్లవారుజామున మూడుగంటల సమయంలో తండ్రి కుమార్తె గొంతుకోసి చంపారు. తానే స్వయంగా కూమార్తెను హత్య చేసినట్లు శంకర్‌లాల్‌ పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. అయితే పోలీసుల భద్రత ఉన్నా.. పింకీ హత్యకు గురికావడంపై.. పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని న్యాయవాదులు అంటున్నారు.