Nov 30,2020 21:21

కూలిపోవడానికి ముందు ఇళ్లు


ప్రజాశక్తి-పీలేరు రూరల్‌
మండలంలో నివర్‌ తుపాను భీభత్సానికి ఒక కుటుంబానికి చెందిన ఇల్లు కూలి నేలమట్టం అయిపోగా ఆ కుటుంబంలో జరగవలసిన పెళ్లి ఆగిపోయి కన్నీటి రోదన మిగిల్చింది. పీలేరు పట్టణంలోని జెకె కాలనీకి చెందిన షేక్‌ ఖాజాపీర్‌కు కాలనీ చివర గార్గేయ నదికి 100మీటర్ల దూరంలో రూ.20లక్షలకు పైగా విలువ చేసే ఇల్లు ఉంది. ఆయన కుమార్తెకు డిసెంబర్‌ మొదటి వారంలో పెళ్లి నిశ్చయం కావడంతో కావలసిన నగలు, నగదును సిద్ధం చేసుకున్నారు. అయితే అనుకోని సంఘటన వారి కుటుంబాన్ని కలగా మిగిల్చింది. ఈ నెల 26న కురిసిన నివర్‌ తుపాన్‌ వరద ధాటికి గార్గేయ నది ఇరువైపులా వందమీటర్లు కోతకు గురి అయింది. ఈ కోత వంద సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అత్యంత బీభత్సం సష్టిస్తూ రావడంతో నవంబరు 27 తెల్లవారు జామున ఇళ్లు నేల మట్టమయింది. అయితే వరద ముంపుకు అరగంట ముందు పోలీసులు, స్థానికులు అప్రమత్తం చేయడంతో వీరి కుటుంబం నిద్ర లేచి బయటకు వచ్చిరాగానే వరద ఇంటిని కూల్చేసిందని బాధితుడు ఎస్‌. ఖాజాపీర్‌ తమ ఆవేధన వ్యక్తం చేశారు. కనీసం అరగంట అవకాశం ఉన్నా కుమార్తె పెళ్లికి సిద్ధం చేసుకున్న 600గ్రాముల నగలను ,రూ.లక్ష నగదును కాపాడుకునేవారమని కన్నీట పర్యంతమయ్యారు. రెండు రోజులుగా కూలిన ఇంటి శిధిలాల్లో పెళ్లికి దాచిన నగలు, నగదు దొరుకుతాయేమో అన్న ఆశతో జేసిబీతో శిథిలాలను తిరగేస్తున్నట్లు తెలిపారు. ఇళ్లు కొట్టుకుపోయి సర్వస్వం కోల్పోవడంతో నిలువ నీడ లేకపోవడంతో పెళ్లి ఆగిపోయిందని రోధిస్తున్నారు. ప్రస్తుతం బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నామని తెలిపారు. పండ్ల వ్యాపారం చేసి జీవిస్తున్నామని తమది ఉమ్మడి కుటుంబం అని ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. . ఇక ఇళ్లు నిర్మాణానికి పనికిరాదని రూ. 20లక్షలు ఖర్చు చేసి నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యంతమయ్యారు.