Sep 05,2021 13:31

ప్రేమకథల్లో ఇటీవల కులదురహంకారాన్ని స్పృశిస్తున్న చిత్రాలు ఈ మధ్యకాలంలో చాలానే వచ్చాయి. మరాఠీలో వచ్చిన 'సైరాట్‌' మొదలుకొని.. ఇటీవల తెలుగులో వచ్చిన 'ఉప్పెన' వరకూ కుల దురహంకారాన్ని రకరకాల కోణాల్లో ఆవిష్కరించాయి. సమాజంలో అంతరాల్ని, వివక్షని తెరపై చూపించడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. భారతీయ సినిమాల్లో ఈ ప్రయత్నం తరచూ జరిగేదే. అయితే ఈసారి గోదావరి జిల్లాల నేపథ్యాన్ని వాడుకుంటూ కులదురహంకారం - ప్రేమ కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు కరుణకుమార్‌. తొలి చిత్రం 'పలాస'తో ఊరి చివరి జీవితాల్ని అత్యంత సహజంగా తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. అయితే ఈసారి పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకొని చేసిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్‌'. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అందుకు తగినట్లుగా ఉందా? తన పంథాకు భిన్నంగా సుధీర్‌బాబు చేసిన ప్రయత్నం ఫలించిందా? లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..!

టైటిల్‌ : శ్రీదేవి సోడా సెంటర్‌
నటీనటులు : సుధీర్‌ బాబు, ఆనంది, నరేశ్‌, పావల్‌ నవగీతన్‌, తదితరులు
దర్శకత్వం : కరుణ కుమార్‌
నిర్మాతలు : విజరు చిల్లా, శశి దేవిరెడ్డి
నిర్మాణ సంస్థ : 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌
ఎడిటర్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌
విడుదల తేదీ : 27 ఆగస్టు 2021

      ట్‌ చేస్తే.. గోదావరి జిల్లాల్లో సూరిబాబు (సుధీర్‌బాబు) పేరున్న ఎలక్ట్రీషియన్‌. ఊళ్లో తిరణాళ్లకు, పెళ్లిళ్లకు, పండుగలకు లైటింగ్‌ చేస్తూ బిజీగా ఉంటాడు. చుట్టుపక్కల ఏ వేడుకైనా సూరిబాబు డీజే సెట్టు మోగితేనే.. లైటింగ్‌ మెరిస్తేనే. అనుకోకుండా జాతరలో సోడాల కొట్టు పెట్టిన 'శ్రీదేవి సోడా సెంటర్‌' యజమాని సంజీవరావు (నరేశ్‌) కూతురు శ్రీదేవి (ఆనంది)ని చూసి, మనసు పారేసుకుంటాడు సూరిబాబు. ఆమె కూడా అతనితో ప్రేమలో పడుతుంది. కానీ కూతురికి తన కులానికి చెందిన వాడితోనే పెళ్లి చెయ్యాలనుకుంటాడు సంజీవరావు. దీంతో వీరిద్దరి ప్రేమకి కులం అడ్డుగా నిలుస్తుంది. ఇదిలా ఉండగా ఊరి పెద్దగా చెప్పుకొనే కాశీ (పావుల్‌ నవగీతన్‌) అనుచరుడితో సూరిబాబుకి గొడవవుతుంది. దీంతో వీరిద్దరినీ విడదీయడానికి కాశీ సహాయాన్ని కోరతాడు సంజీవరావు. సూరిబాబుపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న కాశీ తప్పుడు హత్య కేసులో ఇరికించి, సూరిబాబును జైలుకు పంపిస్తాడు. కేసు కొట్టేస్తారనుకుంటే, అనుకోని కారణాలతో మళ్లీ సూరిబాబు మెడకు చుట్టుకుంటుంది. అలా, ఓ హత్య కేసులో జైలుకి వెళ్లొచ్చాక సూరిబాబు జీవితంలో ఏం జరిగింది? కాశీ ఉద్దేశమేంటి? సూరిబాబు.. శ్రీదేవిని మళ్లీ కలిశాడా లేదా? సూరిబాబు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
     కులాల మధ్య అంతరాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. పరువు, ప్రతిష్టల కోసం పాకులాడుతూ కొందరు తీసుకునే నిర్ణయాలు.. ఎలాంటి విషాదాలకు దారితీస్తాయో కమర్షియల్‌ హంగులను మేళవిస్తూ సందేశాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. పరువు అనేది జనాల అభిప్రాయాలను బట్టి కాదు మనిషి మనసుల్ని బట్టి ఉంటుందనే పాయింట్‌తో సినిమాను రూపొందించారు. సూరిబాబు, శ్రీదేవి ప్రేమకథతో ప్రథమార్థం ఆహ్లాదభరితంగా సాగుతుంది. సూరిబాబు, కాశీ మధ్య వైరానికి దారితీసిన సన్నివేశాల్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. తమ ప్రేమను అడ్డుకోడానికి కాశీ వేసే ప్లాన్స్‌ను సూరిబాబు తిప్పికొడుతూ సాగించే పోరాటంతో ద్వితీయార్థాన్ని ఉత్కంఠగా మలిచారు. పతాక ఘట్టాలు హృద్యంగా సాగుతాయి. కథ పాతదే అయినా.. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో మాదిరిగా యాక్షన్‌ ఘట్టాలతో కాకుండా ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. క్లైమాక్స్‌లో వచ్చే సంభాషణలు ప్రేక్షకుడిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. సినిమా గురించి స్థూలంగా చెప్పాలంటే పాత చింతకాయ పచ్చడే కావొచ్చు.. దాన్ని సరికొత్తదనంతో.. ఇష్టపడేలా.. అర్థవంతంగా చేయడంలోనే ఉంది అసలు రుచి. అలా సరికొత్తగా చేసి, జనాలకు వడ్డించాడు దర్శకుడు కరుణకుమార్‌. రుచి చూసి చెప్పాల్సిందే ప్రేక్షకులే.
     సుధీర్‌బాబు సూరిబాబు పాత్రలో జీవించేశాడు. హీరోయిన్‌ ఆనంది కూడా సుధీర్‌తో పోటీపడి నటించింది. నరేశ్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైలాగ్‌లతోనే చక్కటి విలనిజాన్ని పండించారు నవగీతన్‌. రఘుబాబు, సత్యంరాజేష్‌, సప్తగిరి పాత్రల ద్వారా కామెడీతో పాటు ఎమోషన్స్‌నూ పండించారు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. శ్యాందత్‌ కెమెరా పనితనం అడుగగడునా కనిపిస్తుంది. ముఖ్యంగా పడవ పోటీల్లో విజువల్స్‌ ఆకట్టుకుంటాయి. మణిశర్మ సంగీతం, బిజిఎం చిత్రానికి ప్రధాన బలం. దర్శకుడు కరుణకుమార్‌ అందరికీ తెలిసిన కథనే చెప్పాడు. కానీ ఆయన ఎంచుకున్న నేపథ్యం, మాటలతో.. కొన్ని సన్నివేశాల్లో డ్రామాపై తనదైన ముద్రవేశారు. నిర్మాణంలో నాణ్యత, విలువలు అడుగడుగునా కనిపిస్తాయి. కాకపోతే ఎడిటింగ్‌ ఇంకా బెటర్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది.