Oct 03,2021 13:10

ప్రేమలో ఇద్దరు వ్యక్తులు కలవడానికి వచ్చే అవాంతరాలెన్నో, వాటిని వెండితెరపై చూపించే చిత్రాలకు ఆదరణ బాగానే ఉంటుంది. దర్శకులు నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని, ప్రేమకథలను సిల్వర్‌ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తుంటారు. అయితే అన్ని ప్రేమకథలూ ప్రేక్షకాదరణ పొందవు. పక్కా క్యూట్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ ఫ్యామిలీ స్టోరీస్‌లో ప్రేమ కథలను మిక్స్‌ చేయడంలో శేఖర్‌ కమ్ములకు ఓ స్టైల్‌ ఉంది. అయితే ఈసారి తన పంథాను మార్చుకుని, ఓ డిఫరెంట్‌ ప్రేమకథను రూపొందించాడు. అదే 'లవ్‌స్టోరి'. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. మరి ఈ 'లవ్‌స్టోరి' ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..!

టైటిల్‌ : లవ్‌స్టోరి
నటీనటులు : నాగ చైతన్య, సాయి పల్లవి, ఈశ్వరీరావు, దేవయాని, రాజీవ్‌ కనకాల తదితరులు
సంగీతం : పవన్‌ సిహెచ్‌
సినిమాటోగ్రఫీ : విజరు.సి.కుమార్‌
ఎడిటింగ్‌ : మార్తాండ్‌ కె వెంకటేష్‌
నిర్మాతలు : కె.నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పుష్కర్‌.రామ్మోహన్‌రావు
దర్శకత్వం : శేఖర్‌ కమ్ముల
బ్యానర్‌ : అమిగో క్రియేషన్స్‌, శ్రీ వేంకటేశ్వర
విడుదల తేది : సెప్టెంబర్‌ 24, 2021    థలోకి వెళ్తే.. నిజామాబాద్‌ ఆర్మూర్‌కు చెందిన రేవంత్‌ (నాగచైతన్య) ఒక మధ్యతరగతి కుర్రాడు. డబ్బులు సంపాదించాలని హైదరాబాద్‌కు వస్తాడు. దీంతో జుంబా సెంటర్‌ నడుపుతూ సొంత కాళ్ల మీద నిలబడతాడు. చిన్నప్పటి నుంచి ఊళ్లో వివక్ష చూపించడంతో, బాగా స్థిరపడి ఉన్నతంగా బతకాలనేది అతని కల. ఇంజనీరింగ్‌ చదువుకుని, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలని అదే గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి మౌనిక (సాయిపల్లవి). ఊరి నుంచి బయటికొచ్చి, సొంత సంపాదనతో బతకాలనే ఆలోచనతో ఉంటుంది. అయితే చెప్పుకోలేని మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుంటుంది. రేవంత్‌, మౌనిక ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. మౌనిక చక్కగా డాన్స్‌ చేస్తుందని ఓ సందర్భంలో తెలుసుకున్న రేవంత్‌ ఆమెను తన డాన్స్‌ స్కూల్లో పార్ట్‌నర్‌గా జాయిన్‌ చేసుకుంటాడు. మౌనిక వచ్చిన తర్వాత డాన్స్‌ స్కూల్‌కు మంచిపేరు వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. అయితే వారి ప్రేమకు ఆస్తులు, అంతస్తులతో పాటు కులం అడ్డుగోడగా నిలుస్తుంది. దీంతో రేవంత్‌, మౌనిక పారిపోడానికి ఓ పథకం వేసుకుంటారు. ఇంతకీ ప్లాన్‌ ప్రకారం ఇద్దరూ పారిపోయారా? ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? ఇంకా ఏమేం అంశాలు స్పృశించారు అనేది మిగతా కథ.
      శేఖర్‌ కమ్ముల సినిమాటిక్‌ ఉద్వేగాలు కాకుండా హృద్యమైన భావోద్వేగాలు ఆవిష్కరిస్తుంటారు. కుల వివక్ష, మహిళా సాధికారత లాంటి అంశాలతో పాటు, ఇళ్లల్లో అమ్మాయిలపై జరిగే లైంగిక హింస వంటి సంక్లిష్టమైన అంశాల్ని స్పృశించారు. బయటికి చెప్పడానికి, మాట్లాడుకోవడానికీ ఇష్టపడని లైంగిక దాడుల గురించి ఓ ప్రేమకథ ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం మంచి పరిణామం. తెలుగు సినిమాలో ఇది దాదాపు మొదటి ప్రయత్నమనే చెప్పొచ్చు. సున్నితమైన ఈ అంశాన్ని తెరపై అంతే సున్నితంగా ఆవిష్కరించారు.
      కథానాయకుడి జీవితాన్ని పరిచయం చేస్తూ నేరుగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. మధ్య తరగతి కుర్రాడి కష్టాలు, కలల్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. అదే సమయంలో కథానాయిక తన కలల్ని సాకారం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో ఆమెకి ఎదురయ్యే ఇబ్బందులు ప్రేక్షకులను హత్తుకుంటాయి. ప్రథమార్ధం మొత్తం సెన్సిబిలిటీస్‌తో సరదాగా సాగుతుంది. ద్వితీయార్ధంలో అసలు కథ మొదలవుతుంది. రేవంత్‌, మౌనిక ప్రేమకి ఎదురయ్యే సవాళ్లు, ఊళ్లో పరిస్థితులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ముఖ్యంగా మౌనికకి తన ఇంట్లో ఎదురైన సమస్య గురించి చెప్పే సన్నివేశాలు మింగుడు పడనిరీతిలో సాగినా.. అవి ఆలోచన రేకెత్తిస్తాయి. సమాజానికి ఓ మంచి సందేశాన్నిస్తాయి. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ని బూతులా చూసేవాళ్లకు ఇలాంటి సినిమాలు చేరటం అవసరం. ఆ రకంగా ఇతర చిత్రాల కంటే ఇది భిన్నమైన కథగా నిలుస్తుంది. చివరగా ప్రేమకు కావాల్సింది కులాలు, ఆస్తులు, అంతస్తులు కావు.. రెండు మంచి మనసులు.. అనే విషయాన్ని చక్కగా ఎలివేట్‌ చేశాడు.
      నాగచైతన్య, సాయిపల్లవి నటన చిత్రానికి ప్రధానబలం. వీరిద్దరూ రేవంత్‌, మౌనిక పాత్రల్లో ఒదిగిపోయారు. మధ్య తరగతి కుర్రాడిగా కనిపిస్తూ నాగచైతన్య పలికించిన భావోద్వేగాలు, తెలంగాణ యాస పాత్రకి జీవం పోశాయి. ఏదో సమస్యతో బాధపడుతున్న ఓ యువతిగా, ఏదైనా సాధించాలనే తపన ఉన్న నేటితరం అమ్మాయిగా సాయిపల్లవి చక్కటి అభినయం ప్రదర్శించింది. జుంబా నేపథ్యంతో కూడిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి చేసిన డ్యాన్సులు కూడా అలరిస్తాయి. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని, ఉత్తేజ్‌ కీలక పాత్రల్లో కనిపించి, చక్కటి అభినయం ప్రదర్శించారు.
     సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. పవన్‌ సీహెచ్‌ సంగీతం చిత్రానికి ప్రధానబలం. పాటలు హత్తుకుంటాయి. విజరు సి.కుమార్‌ కెమెరా ప్రతి సన్నివేశాన్నీ తెరపై సహజంగా ఆవిష్కరించింది. శేఖర్‌ కమ్ముల తన మార్క్‌ మేకింగ్‌తోనే ప్రస్తుత సమాజానికి అవసరమైన కొన్ని అంశాల్ని స్పృశించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.