Oct 28,2021 19:16

కమిషన్‌ చైర్మన్‌కు సమస్యలు వివరిస్తున్న యువకుడు

ప్రజాశక్తి-చీపురుపల్లి : జిల్లాలోని పోలినాటి వెలమ కుటుంబాలకు జారీచేస్తున్న బి.సి. కుల ధ్రువ పత్రాలు కేంద్ర ప్రభుత్వంలో చెల్లుబాటయ్యేలా ప్రయత్నిస్తామని బి.సి.కమిషన్‌ చైర్మన్‌ అంబటి శంకరనారాయణ చెప్పారు. జిల్లాలో పోలినాటి వెలమలు నివసిస్తున్న చీపురుపల్లి మండలం కర్లాం గ్రామాన్ని కమిషన్‌ సభ్యులు గురువారం సందర్శించారు. ధ్రువ పత్రాల సమస్యల విషయంలో ఆ గ్రామ యువత, విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. చైర్మన్‌ స్పందిస్తూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోనే పోలినాటి వెలమ కులం వారు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద నమోదై ఉన్నందున, ఈ జిల్లాలో జారీచేసిన ధ్రువపత్రాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు గుర్తించడం లేదని పేర్కొన్నారు. ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమేనని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలగ కులానికి చెందిన పలువురు తమను ఉత్తరాంధ్ర జిల్లాల్లో బి.సి.లుగా గుర్తించాలని కోరుతూ కమిషన్‌కు వినతిపత్రం అందించారు. శిష్టకరణాల సంఘం ప్రతినిధులు కూడా కమిషన్‌కు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌(ఆసరా) జె.వెంకటరావు, బి.సి.సంక్షేమాధికారి కీర్తి తదితరులు పాల్గొన్నారు.