Jun 13,2021 08:06
  • రెండు నెలల వ్యవధిలో 3,710 మంది మృతి
  • 7,89,825 మందికి కరోనా

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రెండో వేవ్‌ కరోనా రాష్ట్ర ప్రజలను కుదిపేసింది. మార్చి రెండో వారంలో ప్రారంభమై చివరి వారం నాటికి ఊపందుకుని ఏప్రిల్‌లో పూర్తిగా విరుచుకుపడింది. ఫలితంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మొదటి వేవ్‌తో పోల్చితే రెట్టింపు వేగంతో కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా వేలల్లో సంభవించాయి. కరోనాతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. వందలాది మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. కేవలం ఏప్రిల్‌, మే నెలల్లో 3,710 మంది కరోనా లక్షణాలతో చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మరో 7,89,825 మందికి ఆ నెలల్లోనే వ్యాధి సోకింది. ఇవి కేవలం ప్రభుత్వ లెక్కలు మాత్రమే. ఇంకా ఇళ్లల్లో చనిపోయినవారి లెక్కలు అదనం. ఎంతో మంది లక్షణాలున్నా టెస్టులు చేసుకోకుండా ఇళ్లల్లోనే చికిత్స పొందు తూ కోలుకున్నారు. వీరిలో చాలా మంది చనిపోయిన పరిస్థి తులను కూడా చూశాం. ఆక్సిజన్‌ అందక కొందరు, బెడ్లు చాలక మరికొందరు, వైద్యం అందక ఇంకొందరు ఇలా వేలాది మంది చనిపోయారు. ఇప్పటి వరకూ ఈ రెండు వేవ్‌లూ 18 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువ శాతం ప్రభావం చూపాయి. ఇప్పుడు రానున్న థర్డ్‌ వేవ్‌ చిన్నపిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
   రాష్ట్రంలో గతేడాది మార్చి 23న తొలి కరోనా కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి 23 వరకూ కరోనా లక్షణాలతో 7,191 మంది చనిపోయారు. 8,95,121 మంది వ్యాధి బారిన పడ్డారు. మార్చి 24 నుంచి మే 24 మధ్య రెండోవేవ్‌ కరోనా విజృభించడంతో కేవలం 60 రోజుల వ్యవధిలో 2,935 మంది మరణించారు. 6,85,706 మందికి వ్యాధి సోకింది. కాగా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కేవలం 106 మరణాలు నమోదవగా, 18,907 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌, మే, జూన్‌ 12 వరకూ ఈ రెండున్నర నెలల్లో 4,662 మంది చనిపోయారు. మరో 8,99,814 మంది వ్యాధి బారిన పడ్డారు. జూన్‌ మొదటి వారం నుంచి రెండో వేవ్‌ కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. పిల్లలకు కరోనా వస్తే వారితో పాటు వారి తల్లి కూడా ఆస్పత్రుల్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి ముందు ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులకు టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో 1,28,824 మంది తల్లులకు టీకా వేశారు. ఇంకా మిగిలిన వారందరికీ టీకా వేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదే శాలు జారీ చేశారు. కాగా థర్డ్‌వేవ్‌ వల్ల సుమారు 18 లక్షలు కు పైగా జనం ఇబ్బంది పడే అవకాశం ఉందని, 4.5 లక్షల మంది పిల్లలు వ్యాధి బారిన పడతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్రంలో టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసి పిల్లల ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వైద్యులు, మందుల కొరత వంటి అంశాలపై నివేదిక తెప్పించుకుంది. నివేదిక ఆధారంగా ఆస్పత్రుల్లో బెడ్లు, మందులతో పాటు వైద్యులను నియమించుకునేందుకు సిద్ధమవుతోంది.