Nov 22,2021 07:00

’'కిటికీ రెక్కని వెలుతురు వేళ్ళతో తడుతూ
ఒక రవికిరణం.''
''ఏమో సముద్రం నాలాగే ఉందో..
నేనే సముద్రంలా ఉన్నానో మరి!''
''నీకు నా దేహమొక క్రీడా స్థలం/ ఎప్పుడు పడితే అప్పుడు / నా ప్రమేయమేమీ లేకుండానే ఆడుకుని... చెమట చుక్కలను తుడుచుకుంటూ/ తృప్తిగా ఠీవిగా నడిచి పోతావు.. /.. నేను... అవయవాలను పోగు జేసుకుంటూ...''
''మా బాడీ షేమింగుల/ దుర్గంధపూరిత వ్యాఖ్యలకు ..../ మీ నాలుకలను తెగ్గోసి/ కాకులకు గద్దలకు/
ఆహారంగా వేస్తాం జాగ్రత్త.''
ఇవి గత సంవత్సరం వెలువరించిన 'కొత్త వేకువ' కవితా సంపుటిలో కొన్ని కవితాపంక్తులు. భావుకత నుంచి భావోద్వేగం దాకా, భావోద్వేగం నుంచి భావోద్యమం వైపుకు అడుగులు వేస్తున్నది ఎవరా? అని కవిలోకం ఒక క్షణం ఆగి చూసింది. ఆ కవయిత్రి రాంభక్త పద్మావతి. ఇంతా చేసి ఆమె రచనల వయసు నాలుగేళ్ళే. 2017 నుంచి మాత్రమే రచనలు చేయడం మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే అనేక బహుమతులు, పురస్కారాలు పొందారు. నాణ్యమైన, నవ్యమైన రచనలతో తెలుగు సాహితీలోకంలో త్వరగా గుర్తింపు పొందారు. కవయిత్రిగా వేగంగా సోపానాలు అధిరోహిస్తున్న వీరు ఊహించని రీతిలో కథా సంపుటిని వెలువరించడం ఆనందదాయకం. 'కురిసిన అలసిన ఆకాశం' పేరుతో వెలువడిన ఈ కథాసంపుటిలో మొత్తం 17 కథలున్నాయి. మన పక్కింటిలోనో, మన ఇంట్లోనో జరిగినవని అనిపించేవి కొన్ని, జరిగితే బాగుండు అనిపించేవి కొన్ని. విభిన్నమైన అంశాలతో రాయబడిన ఈ కథలు, 'కవయిత్రి గదా... కథలు ఎలా ఉంటాయో...' అనుకునేవారు కూడా అభినందించే స్థాయిలో ఉన్నాయి.
అక్కడక్కడా కవయిత్రిగా తనకున్న భావ పరంపరను పట్టించే కవితాత్మక పంక్తులు పాఠకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. 'కవిత్వం, కథలు నాకు రెండు కళ్లంటూ... అయినా నేను కథలు విరివిగా రాయలే'నంటూనే అతి తక్కువ కాలంలో ఇన్ని కథలు రాయడం విశేషం. పిల్లాడికి ఉన్న ఆటిజం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తల్లిదండ్రులు ఎలా ఎదుర్కోవాలి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి వంటి ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలను 'పూలవర్ణ లోకం'లో చూడవచ్చు. ప్రపంచంలో ప్రతి 160 మందిలో ఒకరికి ఉన్నట్లుగా తెలుస్తున్న ఈ మానసిక అపసవ్యత గురించి తెలియచేస్తూ పాజిటివ్‌ దృక్పథంతో సాగిన కథ. కథలో భాగంగా వచ్చిన 'రాన్‌ కాఫ్‌ మన్‌' ఉదంతం కథకు అదనపు విలువను తీసుకొచ్చింది. ఇలాంటి కథలు రాయాలంటే తగిన సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. అంతే బాధ్యతగా రాయాల్సి ఉంటుంది. ఈ విషయంలో రచయిత్రి కృతకృత్యులయ్యారు.
ప్రతి మనిషికి తనకంటూ ఒక అస్థిత్వం ఉంటుంది. అది వారు తప్ప ఎవరూ పూరించలేరు. 'ఒక చోట అక్కరలేనితనం, మరో చోట ఏర్పడే ఖాళీని పూరించడం' ఒక సామాజిక వింత. తల్లీ తండ్రీ చిన్నప్పుడే చనిపోతే, సరైన ప్రేమాభిమానాలు పొందక పెరిగిన ప్రసాద్‌కి, భార్య రమణి ఆ లోటు పూరించింది. కానీ తను మరణించడంతో మళ్ళీ పూర్వ స్థితి పునరావృతం అవుతుంది. దీనికి కొడుకుతో పెరిగిన దూరమూ కారణమైంది. అటువంటి సమయంలో కొత్తగా ఏర్పడిన మిత్రుడూ, అతని కుటుంబం అతనికి ఎలా తోడ్పడిందో 'దీపంలో చమురు'లో తెలుస్తుంది. 'సజావుగా ప్రవహిస్తుంటే నది కూడా అందంగా అగుపిస్తూ కనువిందు చేస్తుంది. అదే వరదై విరుచుకుపడితే...' ఉపమానంతో మొదలైన ఓ కథ 'రంగువెలిసిన బతుకు'. దినదిన గండంగా సాగుతున్న బతుకులు మనిషిని దారి తప్పించడానికి ప్రోత్సహిస్తున్నాయి. తల్లిని తలచుకొని కూతురు, కూతురిని తలచుకొని తల్లి... వారి బతుకులు ఎటువంటి స్థితిలోకి నెట్టివేయబడ్డాయి? చివరకి ఏం జరుగుతుంది? మనసును పట్టి కుదిపే కథనంతో సాగి, కథ పూర్తయ్యాక కూడా అలా తొలిచేస్తుంది.
యువరాణిలా పెరిగిన పుట్టింటిని వదిలి పెళ్లి పేరుతో తనది కాని మరో రాజ్యంలోకి అపరిచితురాలిలా అడుగు పెడుతుంది స్త్రీ. ఒక్కసారిగా పెద్దయినట్లు, బరువు బాధ్యతలు నెత్తినపడతాయి. అనుక్షణం సాధించే అత్తగారి ప్రవర్తనకు కారణమేంటీ? చివరకు అదే అత్తగారు ఆమె పట్ల చూపిన స్పందన ఎలా ఆశ్చర్యానికి గురిచేసింది? 'గెలుపు'లో చూడొచ్చు. గెలుపు పదం వాడినంత సులువు గాదు నిజంగా గెలవడం. కానీ ఆ గెలుపు ఇచ్చే స్పర్శ మాత్రం అద్భుతం. అందుకే ఈ కథ పోటీలో తగు స్థానం పొందింది. అగ్ని పర్వతాలు స్ఫోటనం చెందడం సాధారణం. మరి మంచు పర్వతం..? ఒక మనిషిని సహనంగా ఉండమని చెప్పడం సులభం. కానీ ప్రతి సందర్భంలోనూ సహనంగా ఉండాలని యత్నపూర్వకంగా ప్రవర్తించాల్సి రావడం ఎంత కష్టమో అనుభవించేవారికే తెలుస్తుంది. ఎన్నడూ లేనిది పద్మావతి ఎందుకు అలా ప్రవర్తించింది? అసలు పేలదనుకున్న మంచుపర్వతం ఎందుకు వేడి లావాను వెదజల్లింది? 'పేలిన మంచుపర్వతం'లో చూడొచ్చు.
ఐఐటీ చదివి మంచి కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్న సంజరుని కాదని, సాధారణమైన చదువు, బ్యాంక్‌ ఉద్యోగిగా ఉన్న వంశీని శ్రీవల్లి ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు? శ్రీవల్లికి ఉన్న కారణాలు ఒక ఆడపిల్ల మానసిక స్థాయిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే కథ. స్త్రీలను చూసే మన కోణంలో మార్పును తెస్తుంది. అందుకే 'ఎంపిక', కథల పోటీలో ఎంపికైంది. వయసు పెరుగుతున్న కొద్దీ స్వార్థం అనే వలువల మాటున పసితనం మాయమవుతుంది. కానీ అదే పసితనం పెద్దవారు కళ్ళు తెరిచేలా చాలా సార్లు పెద్దరికంగా ప్రవర్తిస్తుంది. అదే విషయాన్ని 'పూల మనసులు' తెలియజేస్తుంది. ఇదీ బహుమతి కథే.
అర్ధరాత్రి ఆ ఐఎఎస్‌ అధికారి సూర్యకిరణ్‌ ఇంట్లో ల్యాండ్‌ ఫోన్‌ మోగింది. ఫోన్‌లో వచ్చిన సమాచారం విన్న జ్యోతి మనసులో విస్ఫోటనం. పక్కనే అలిసిపోయి నిద్ర పోతున్న తల్లి. తెల్లారితే తన ఫైనల్‌ పరీక్ష. తండ్రి 'కిడ్నాప్‌' వార్తకు ఆమె ఎలా స్పందిస్తుంది?
ఒక్కగానొక్క కూతురు సురభిని జాగ్రత్తగా పెంచింది. కానీ సురభి తల్లిని డబ్బుల యంత్రంలా భావించింది. 'ఎప్పటికీ తరగని' అవసరాల కోసం డబ్బు కోసం తల్లి దగ్గర కొచ్చింది. పక్కింటి ఆంటీ ఇచ్చిన, తల్లి రాసిన ఉత్తరం ఆమెను మార్చిందా? పిల్లల ప్రవర్తనతో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం ఏమిటి? 'పిల్లలు తల్లిదండ్రుల మనసుపై చేసే గాయాల నొప్పి, మళ్ళీ వాళ్ళు తల్లిదండ్రులై నప్పుడే తెలుస్తుంది' అంటూ చెప్పిన 'కురిసిన అలసిన ఆకాశం'.
ఇన్ని కోట్ల ముఖాలు తిరుగుతున్న ఈ ప్రపంచంలో ఏ మనిషీ మరొక మనిషిలా ఉండకపోవడం ఎంత ఆశ్చర్యం? అలాంటప్పుడు ఎవరికి వారు ప్రత్యేకమే గదా. అందుకే పుట్టిన రోజు జరుపుకోవాలన్న వసుధ కోరిక ఎప్పటికైనా తీరుతుందా? ఆ 'చిన్ని చిన్ని ఆశ' తీర్చినవారెవరు? మానవ సంబంధాలపై నమ్మకం పెంచే కథ ఇది. తల్లి వైవాహిక బంధంలో ఏర్పడిన ఇబ్బందులతో పెళ్ళంటేనే విముఖత ఏర్పడిన డాక్టర్‌ కృష్ణవంశీకి క్లాస్‌మేట్‌ భవాని అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి మాత్రం వద్దు. అతని వింత వైఖరి ఏ రూపం తీసుకుంది? 'అతడు ఆమె ప్రేమ'. ఇది ఒక ఫీల్‌ గుడ్‌ స్టోరీ. కోవిడ్‌ కారణంగా ఎన్నో జీవితాలు అతలాకుతలమై పోయాయి. ఉన్న ఊళ్ళో పని దొరకక పట్నం వెళ్ళిన వెంకటేసు, లచ్చిల జీవిత నావ ఏ తీరానికి చేరింది? ఎందరి జీవితాల్లోనో వెన్నెలను మాయం చేసిన మహమ్మారి వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది? 'కూలిన వెన్నెల'లో కళ్లకు కట్టించారు.
తాడు అని తెలిసేంతవరకు, అది పాముగా మారి ముచ్చెమటలు పట్టిస్తుంది. 'భయం భయం'లో ఆమెకు బస్‌ డ్రైవర్‌గా ఉన్న మెక్సికన్‌ లేడీ అలాగే కనపడుతుంది. అనుకోకుండా అర్ధాంతరంగా రద్దయిన బస్‌ సర్వీస్‌ కారణంగా అర్ధరాత్రి ఆమెకు ఎదురైన అనుభవం మనకు జరిగిన కొన్ని సంఘటనలను తప్పక గుర్తుకు చేస్తుంది. పంజరంలో బంధించబడిన పావురానికి ఎగిరే శక్తి ఎంత ఉందో, స్వేచ్ఛగా వదిలేస్తే కదా తెలిసేది? సుధ తన తోడి కోడలి కొడుకుని చదివించడంలో పడిన ఇబ్బందులు, వాడు ఎలా ఎదిగిందీ అద్భుతంగా ఆవిష్కరించబడింది 'ఎగిరే పావురం'లో. ఆ రోజు అపార్టుమెంటులో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అందరిళ్ళల్లో పని చేసే లక్ష్మి ఉన్నట్టుండి ఎందుకు ఏడ్చింది? తోటి వారి కష్టంలో సాయం చేయడం గురించి 'మా లక్ష్మి ఏడ్చింది'లో. చదువులో ముందున్నా గృహిణిగా ఉండటానికి ఇష్టపడిన దీప తన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంది? ఎలా తన ఉనికిని నిరూపించుకొంది? అత్తామామలతో పొదరిల్లులా ఉండే ఆ ఇంటిని చూస్తే ఎవరికైనా ముచ్చట అనిపిస్తుంది. 'ఉనికి' నిరూపించు కోవాలంటే స్త్రీ ఉద్యోగమే చేయనక్కరలేదు అన్న వాక్యం ఆధారంగా అల్లిన కథ. అమ్మగారింట్లో సుకుమారంగా పెరిగిన యువతి, అత్తగారింటికి వచ్చేసరికి అన్ని బాధ్యతలు ఒకేసారి మోయవలసి వస్తుంది. పైగా తన ప్రమేయం లేని వాటికి కూడా తానే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ స్థితిలో సుగుణ ఏం చేసింది? ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంది 'నువ్వు కూడా..' కధలో రచయిత్రి వివరించారు.
దాదాపు అన్ని కథలూ వైయక్తికంగా వివిధ పార్శ్వాల స్త్రీ స్వభావ చిత్రణగా రూపుకట్టాయి. ఉన్న కథల్లో సింహభాగం ఉత్తమ పురుషలో రాయడం, రచయిత్రి తాను చెప్పాల్సిన దాన్ని బలంగా చెప్పడానికేనేమో అనిపిస్తుంది. పక్కనే జరిగిన ఘటనను మనతో పంచుకుంటున్నట్టు, వీలైన చోటల్లా సలహాలు ఇస్తున్నట్టు సాగి మంచి కథలను, చూసిన అనుభవాన్ని ఇస్తాయి. ఇంకా ముందు ముందు ఇంకా మరిన్ని వైవిధ్యమైన కథలను రచయిత్రి (పద్మావతి రాంభక్త 99663 07777) నుంచి ఆశించడం దురాశ కాదు.

                                                                     -  బాహరా   86868 64896