Jun 13,2021 07:01

   చెప్పబడేది, చెప్పుకునేది కథ. కేవలం మౌఖికంగానే కాదు; కథను బొమ్మ ద్వారా చెప్పొచ్చు. రాత ద్వారా వివరించొచ్చు. నాటకం ద్వారానో, సినిమా రూపానో చూపించొచ్చు. రూపం ఏదైనా సరే, కథ కథే! కథ తెలియని మనిషి ప్రపంచంలో ఒక్కడూ ఉండడు. అసలు కోతి నుంచి మనిషి దాకా ఎదిగిన క్రమమే ఓ పెద్ద కథ. కథ ఒక మనిషి నుంచి మరో మనిషిలోకి ప్రవహించే జీవధార. తరతరాలను ఆవహించే సృజన భావన. కథ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైందీ అంటే-ఆ సమాధానమే పెద్ద కథై కూచొంటుంది. భాష పుట్టకముందే కథ మనసును తట్టి ఉండొచ్చు. మనిషి కళ్లకు కట్టి ఉండొచ్చు! అడవి జంతువు ఆనుపానులను, వేట సంగతులను ఒకరికొకరు తమాషాగా పంచుకోవడం కూడా ఓ మాదిరి కథే ! పరుగెత్తించి పరుగెత్తించి దొరికిన పంది ఆఖరి క్షణాన తప్పించుకు పారిపోయిన ముచ్చట కూడా ఆదిమ బృందాలను అలరించి ఉండొచ్చు. అది మళ్లీ మళ్లీ చెప్పుకోబడి- ఓ వినోద కథగా మారి ఉండొచ్చు. అనాది నుంచి మనిషి జీవితంలో కథ ఒక వ్యాపకం, కథ ఒక ఆటవిడుపు. జీవితం యొక్క పరిధి, పరమార్థం చిన్నదిగా ఉన్నప్పుడు కథ కూడా చిన్నదే. జీవితం అంతకంతకూ విస్తరించి, అనేకనేక అంశాలు వచ్చి చేరేకొద్దీ కథ కూడా విస్తరిస్తూ పోయింది. ఎన్నెన్నో రూపాల్లో, ఎన్నెన్నో ఇతివృత్తాల్లో, ఎన్నెన్నో ప్రయోగాల్లో శత సహస్ర సృజనకారిగా ఎదుగుతూనే ఉంది. చింతచెట్టు కింది పిట్ట కథ నుంచి మల్టీఫ్లెక్సు థియేటరు సినిమా కథ దాకా కథది పెద్ద పరిణామ క్రమం.
    వ్యక్తి వికాస క్రమంలోనే కాదు; సమాజ రూపకల్పనలోనూ కథది ప్రేరణాత్మక పాత్ర. కథలనే ఉగ్గుపాలతోనే ఒకప్పటి బాల్యం వేళ్లూ, చిగుళ్లూ తొడిగింది. పసిపిల్లల మనసులో ప్రశ్నలు పొటమరించటానికి, దయా కరుణ వంటి గుణాలు చివురించటానికి; మానవత్వం, మంచితత్వం మోసులెత్తటానికి; ఉచ్ఛారణ, వ్యక్తీకరణ ఉద్భవించటానికీ కథలు గొప్ప ఉపకరణాలుగా ఉపయోగపడ్డాయి. ''అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకెళ్లారు. ఏడు చేపలు తీసుకొచ్చారు.'' ... ఈ కథ తరతరాలుగా పరంపరగా సాగటానికి ఏ చాతుర్యం దోహదపడుతుంది? ''చేపా చేపా... ఎందుకు ఎండలేదు?'' అన్న ప్రశ్నా, ఆ ప్రశ్నకు దొరికే సమాధానంలోని కార్యకారణ సంబంధం, ''నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?'' అన్న తుంటరి చీమ జవాబులోని గడుసుదనం ... తరతరాల బాల్య దొంతరలను అలరించటంలో కీలకంగా దోహదపడుతున్నాయి. చర్యకు ప్రతి చర్య ఉంటుందని; జరుగుతున్న ప్రతి దాని వెనకా ఓ కచ్చితమైన కారణం ఉండి తీరుతుందని అవగతం చేయటానికి ఈ కథకు మించిన కథ ఇంకేం ఉంటుంది! ప్రశ్నకు ప్రతిబంధకాలు లేని చోట విజ్ఞానం వికసించి తీరుతుందని ఉద్ఘాటించటానికి ఇంత కన్నా గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది! అక్షర జ్ఞానం లేని కాలంలో మన జానపదులు తమ అనుభవాలతో, అద్భుత కల్పనాశక్తితో ఇలాంటి కథలను పుంఖానుపుంఖాలుగా అల్లుకున్నారు. వెన్నెల రాత్రుల్లో, వేసవి మధ్యాహ్నాల్లో కథోపకథలుగా చెప్పుకొని విలసిల్లారు.
   వినోదానికి, సాహస కార్యాల ఉద్ఘాటనకీ పరిమితమైన జానపద కథలు ఆధునిక కాలంలో ఆధునిక జీవితాన్నీ ఒడిసిపట్టుకున్నాయి. చిన్న ప్రయత్నం ద్వారా భర్త ప్రవర్తనను దిద్దుకున్న ఓ తెలివైన ఇల్లాలి ఉదంతం తొలి తెలుగు కథానిక 'దిద్దుబాటు'గా తలుపు తెరుచుకొంది. ప్రయోగం రీత్యా, ప్రయోజనం రీత్యా తెలుగు కథకు కొత్త దారి చూసిన ఘనత గురజాడ అప్పారావుకు దక్కింది. కళ కేవలం కళ కోసం కాదు, ప్రజల కోసమన్న అభ్యుదయ అవగాహనను కథ విషయంలో ఆచరణాత్మకంగా చూసిన క్రాంతదర్శి గురజాడ. ఆ అడుగుజాడలోనే తెలుగు కథ మున్ముందుకు సాగి, ప్రజాజీవితాన్ని, ఆ జీవితంలోని ఆటుపోట్లనీ, అగచాట్లనీ, మానవీయ బంధాలను, కార్యకారణ సంబంధాలనూ వొడుపుగా ప్రదర్శించింది. 110 ఏళ్ల పాటు ప్రజల జీవితాల్లోంచి వందలు వేలుగా కథలు ప్రభవించి, ఎంతో ప్రాచుర్యం పొందాయి. అలాంటి వేలాది కథలను ప్రేమారా చేరబిలిచి, వాటికొక శాశ్వత స్థానాన్ని, చిరునామాను ఏర్పరిచిన కథానాయకుడు కాళీపట్నం రామారావు మాష్టారు ఈమధ్యనే కథలనొదిలి వెళ్లిపోయారు. అయినా కథ ఒంటరి కాదు; ఆధునిక కాలం జన జీవితాలపై విసురుతున్న సవాళ్లను, సందళ్లను అందిపుచ్చుకొని మరింత పుష్కలంగా తెలుగు కథ వెలువడాలి. మరింత ప్రకాశవంతంగా వెలుగొందాలి. కధోపకథలుగా తెలుగు కథ వర్థిల్లుగాక!