Nov 29,2020 22:36

మాధవరాయుడుపాలెంలో పేరుకుపోయిన చెత్త

ప్రజాశక్తి - కడియం 'మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది.' ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ - స్వచ్ఛ సర్వేక్షణ్‌, మన గ్రామం - మన పరిశుభ్రత వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టినా, నిర్వహణా లోపంతో పారిశుధ్యం మెరుగుపడటం లేదు. సమస్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రహదారులు డంపింగ్‌ యార్డుల్లా, డ్రెయినేజీలు మురికి కూపాల్లా మారడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధులబారిన పడుతున్నారు. అపరిశుభ్రత ప్రాంతాలు కుక్కలకు, పందులకు ఆవాసాలుగా మారడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరణించిన పెంపుడు జంతువులను రోడ్ల పక్కనే పడేయడంతో దుర్వాసన షరామామూలే అయ్యింది. మండలంలోని మాధవరాయుడుపాలెం, వేమగిరి, మురమండ గ్రామాల్లో రోడ్ల వెంబడి చెత్త వేయడం, డ్రెయినేజీలు అధ్వానంగా మారడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. డ్రెయినేజీల గుండా మంచినీటి పైపులైన్లు ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఏ రూపంలో రోగాలు సంభవిస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. ప్రజాధనం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త నుంచి సంపద కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. రోడ్లకిరువైపులా వేసిన చెత్త రోడ్లపైకి వస్తే మెషీన్లతో తాత్కాలికంగా పక్కకి నెట్టడంతోనే అధికారులు చేతులు దులుపుకోవడంపై పలువురు తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు, నాయకులు అధ్వాన పారిశుధ్యంపై స్పందించి ప్రజలను రోగాల బారిన నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు.