May 18,2021 22:27

బనగానపల్లెలో కర్ఫ్యూ నిబంధనలను పరిశీలిస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

- ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప
ప్రజాశక్తి - బనగానపల్లె:
 కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేయాలని ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప తెలిపారు. మంగళవారం బనగానపల్లెలో కర్ఫ్యూ అమలును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీధుల్లో పర్యటించి కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పకీరప్ప పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో కర్ఫ్యూ అమలును పరిశీలించి మాట్లాడారు. కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బేతంచెర్ల, బనగానపల్లె, అవుకు మండల కేంద్రాల్లో కర్ఫ్యూను అమలు పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌ రేటు ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే ప్రజలు అవసరాల కోసం బయటకు రావాలని తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 5 గంటల వరకు బయటకొచ్చే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజువారీగా వచ్చే పాజిటివ్‌ కేసులు తగ్గించాలంటే లాక్‌ డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు. అనవసరంగా బయటికి వస్తే వారి వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బనగానపల్లె సిఐ సురేష్‌ కుమార్‌ రెడ్డి, ఎస్‌ఐ మహేష్‌ కుమార్‌లకు కర్ఫ్యూ అమలుపై ఎస్పీ పలు సూచనలు చేశారు. అవుకు మండలంలో కర్ఫ్యూ ఆంక్షలను తనిఖీ చేసిన ఎస్పీ బస్టాండ్‌ ఆవరణలో మాట్లాడారు. మండలంలో కరోనా నియంత్రణలో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కర్ఫ్యూ అమలుపై అవుకు ఎస్‌ఐ జగదీశ్వర్‌ రెడ్డికి పలు సూచనలు ఇచ్చారు. ఎస్‌ఐ నరసింహులు, పోలీసులు పాల్గొన్నారు.