Nov 26,2020 21:05

న్యూఢిల్లీ : కార్పొరేట్లకు బ్యాంక్‌ల లైసెన్స్‌లు ఇవ్వడం అంటే క్రోనీ కాపిటలిజానికి బాటలు వేయడమేనని ప్రపంచ బ్యాంక్‌ మాజీ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్‌ బసు అన్నారు. ప్రభుత్వ చర్యలు ఆర్థిక అస్థిరత్వానికి దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్పొరేట్‌ బ్యాంకుల ఏర్పాటుకు అనుమతించాలన్న ఆర్‌బిఐ వర్కింగ్‌ గ్రూపు ప్రతిపాదన మంచిగా కనిపిస్తున్నప్పటికీ.. చెడు మార్గంలో వెళ్లడం వంటిదేనని గురువారం ఆయన పేర్కొన్నారు. అన్ని విజయవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో పరిశ్రమలకు, కార్పొరేట్లకు మధ్య విభజన రేఖను గీయడానికి ఒక మంచి కారణం ఉందని, మరోవైపు బ్యాంకులు, రుణ సంస్థలు ఒక వైపు ఉన్నాయన్నారు.

'రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల ఏర్పాటు చేసిన ఇంటర్నల్‌ వర్కింగ్‌ గ్రూపు నుంచి ఈ ప్రతిపాదన, బ్యాంకులను సొంతం చేసుకోవడానికి, నిర్వహించడానికి భారత కార్పొరేట్‌ సంస్థలను అనుమతించడం మంచిగా కనిపించే చెడు మార్గంలో వెళ్లడం లాంటిది' అని బసు వివరించారు. రుణాలు తీసుకోవాలనే పారిశ్రామిక సంస్థలకు, రుణాలు ఇవ్వాలనుకునే బ్యాంకులకు మధ్య రుణ కార్యాకలాపాలను ఇది వేగవంతం చేస్తుంది కాబట్టి, మొదటి చూపులో ఇది మంచిగానే కనిపిస్తుందని, కానీ ఇది క్రోనీ క్యాపిటలిజం వైపు నడిపిస్తుందని, చివరికి ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుందని బసు విశ్లేషించారు.

1997లో ఆసియాలో మొండి బాకీలు ఏర్పడ్డానికి అనుసంధాన రుణాలే కారణమని, దీని ఫలితంగానే తూర్పు ఆసియా ఆర్థిక సంక్షోభం థాయిలాండ్‌లో ప్రారంభమైందని బసు గుర్తు చేశారు. బ్యాంకులను సొంతం చేసుకోవడానికి, నిర్వహించడానికి కార్పొరేట్‌ సంస్థలను అనుమతించడం కోసం చట్టంలో సవరణ చేయడం అనేది క్రోని క్యాపిటలిజం, ఆర్థిక సంక్షోభం అనే రెండు ఫలితాల కోసమే అని బసు స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే ఈ ప్రతిపాదనను ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌, మాజీ ఉప గవర్నర్‌ విరాల్‌ అచార్య వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.