
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వల్ల రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోగా, కార్పోరేట్ కంపెనీలకు మాత్రం లాభాల పంట పండించింది. 2020 మూడవ త్రైమాసికంలో భారత్లోని కార్పోరేట్ కంపెనీలు రికార్డు స్థాయిలో రూ.1.33 లక్షల కోట్లను ఆర్జించాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) వెల్లడించింది. కరోనా మహమ్మారి, లాక్డౌన్తో మొదటి త్రైమాసికంలో కొంత క్షీణత నమోదైనప్పటికీ.. అనంతరం లాభాలు పుంజుకున్నాయని వెల్లడించింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బిఎస్ఇ)లో జాబితా చేయబడిన 1,897 కంపెనీల డేటా అనుసరించి ఈ నివేదికను రూపొందించింది. జూన్ 2020తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు 27 శాతం తగ్గాయి. సెప్టెంబర్లో కూడా పాక్షికంగా 6శాతం తగ్గుదల చూపిస్తోంది. అయినప్పటికీ అవి లాభాల బాట పట్టాయని సిఎంఐఇ నివేదిక పేర్కొంది.
ఖర్చులను తగ్గించుకున్నామంటూ ఈ కార్పోరేట్ కంపెనీలు కార్మికులపై వేటు విధించాయి. అధిక శాతం కంపెనీలు కార్మికులను తొలగించగా, మరికొన్ని కంపెనీలు తక్కువ వేతనంతో కాంట్రాక్ట్ ఒప్పందం మీద కార్మికులను తీసుకున్నాయి. ముడిపదార్ధాలు, పరికరాలు, ఉత్పత్తుల నిల్వ వంటి ఇతర ఖర్చులను కూడా తగ్గించుకున్నాయి. ఇవన్నీ కూడా ఆయా కంపెనీలు లాభాల బాట పట్టేందుకు ఉపకరించాయని నివేదికలో వెల్లడైంది.
కాలానుగుణంగా ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. ఈ కంపెనీలు గత ఆరేళ్లుగా లాభాలను ఆర్జిస్తున్నాయి. మార్చి 2020 త్రైమాసికంలో 32వేలకోట్ల రూపాయల లాభాన్ని పొందగా, జూన్ 2020 త్రైమాసికానికి 44.1వేల కోట్ల లాభాలను పొందాయి. గత నాలుగు త్రైమాసికాలలో ఈ కంపెనీల సగటు లాభం రూ. 50.2వేల కోట్లుగా ఉంది. మరోవైపు ఇదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థలో క్షీణత నమోదైంది. ఈ కంపెనీల నుండి కార్మికులను తొలగించడం, సామాన్య ప్రజలపై భారం, నిరుద్యోగం, ఖర్చుల పెంపు, సంక్షేమ పథకాలకు అందించే నిధులను ప్రభుత్వాలు తగ్గించడం, కుటుంబ ఖర్చులు పెరిగిపోవడం వంటివి దేశ ఆర్థిక సంక్షోభంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. డిమాండ్ కూడా భారీగా పతనం కావడం, పెరిగిన వ్యయాలను చెల్లించేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో ఆర్థిక వ్యవస్థ పతనం ప్రారంభమైంది. కాని పారిశ్రామిక వేత్తల, కార్పోరేట్ కంపెనీల సంపద మాత్రం అమాంతం పెరిగినట్లు సిఎంఐఇ డేటా వెల్లడించింది. కరోనా మహమ్మారితో ప్రపంచ జిడిపి పతనం కావడంతో ఆర్థిక వ్యవస్థ ఒక్క శాతం కంటే తక్కువకు పడిపోయిన వాటిలో భారత్తో పాటు అనేక దేశాలు ఉన్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్, జులైల మధ్య మహమ్మారి సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ కుదేలైనప్పటికీ.. బిలియనీర్ల సంపద మాత్రం 27.5 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 10.2 ట్రిలియన్లకు చేరకుందని స్విస్ బ్యాంక్, యుబిఎస్ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో కొత్తగా బిలియనీర్లు అయిన వారి సంఖ్య కూడా 2,189కి పెరిగింది. మహమ్మారి సమయంలో స్టాక్ మార్కెట్లు ద్వారా ఈ బిలియనీర్లు లాభపడ్డారని యుఎస్బి తన విశ్లేషణలో పేర్కొంది.
దీనిని ప్రముఖ ఆర్థిక వేత్త మూలధన కేంద్రీకరణలో భాగమేనని విశ్లేషించారు. రాజకీయ, ఆర్థిక, ఆరోగ్యానికి సంబంధించిన సంక్షోభమేదైనా... సంపన్నులు మరింత ధనవంతులు కావడానికి దారితీస్తుందని ఆయన వివరించారు. వాస్తవానికి.. ఈ వ్యవస్థలో సంక్షోభానికి కారణమయ్యే ప్రతి మానవ విషాదంతో కార్పోరేట్ అనుకూల ప్రభుత్వ యంత్రాంగంతో సంపద ఒక్కచోటే కేంద్రీకృతమవడానికి ఒక సందర్భంగా మారడం పెట్టుబడి దారీ విధానంలో అనివార్యమని అన్నారు.
లాక్డౌన్ తర్వాత రెండుమూడు నెలల కాలంలో కార్మికులు తమ ఆదాయంలో 60శాతం వరకు కోల్పోయారన్న విషయాన్ని అనేక సర్వేలు ధ్రువీకరించాయి. పేదలు అత్యంత దారుణంగా దోపిడీకి గురవుతున్నారు. ఇది భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కార్మికుల నిరసనలు, ఆందోళనలకు దారితీసింది. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభమైన నిరసనలు, లాక్డౌన్ పరిస్థితుల్లోనూ సంపన్న అనుకూల విధానాలను తిప్పికొట్టాలని కోరుతూ... కార్మిక సంఘాల ఐక్యవేదిక నవంబర్ 26న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. 200పైగా రైతుసంఘాలు ఈ నిరసన పిలుపునకు మద్దతు పలికాయి.