May 16,2021 08:45

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్‌ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎపిఎంఐపి పిడి) సుబ్బరాయుడు (50) కోవిడ్‌తో శుక్రవారం రాత్రి మరణించారు. ఆయన గత నాలుగు రోజుల క్రితం కోవిడ్‌ బారిన పడ్డారు. అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం శ్వాస సంబంధిత సమస్య తీవ్రమవ్వడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బెడ్లు ఖాళీలేకపోవడంతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా బెడ్లు లేకపోవడంతో సాయంత్రం వరకు ఆసుపత్రి బయటే వేచి ఉన్నారు. విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే ప్రభుత్వాసుపత్రి వైద్యులకు తెలిపి, చికిత్స అందిచాలని చెప్పారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించి మరణించారు. సుబ్బరాయుడు మృతి పట్ల పలువురు జిల్లా అధికారులు సంతాపం తెలిపారు.