Apr 08,2021 10:12

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా కేసులు దేశంలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,26,789 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది కరోనా మొదలైన తర్వాత ఎన్నడూ ఇన్ని కేసులు నమోదు కాలేదు. అయితే, ఆరోగ్య గణాంకాల ప్రకారం తొలివేవ్‌లో లక్ష కేసులు దాటలేదు. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌లో లక్ష కేసులను మించిపోతున్నాయి. వారం గడిచి నాలుగు రోజులే అవుతున్నా... మూడు సార్లు లక్షకు పైగా కేసులు నమోదవ్వడం గమనార్హం. ఇప్పటి వరకు మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1.29 కోట్లను దాటింది. గడిచిన 24 గంటల్లో 685 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు 1,66,862 మంది మరణించారు. అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఎక్కువ ప్రభావితమౌతున్న దేశంగా భారత్‌ నిలిచింది. ప్రస్తుతం దేశంలో క్రియా శీలక కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 9,10, 319 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 9,01, 98, 673 డోసుల వ్యాక్సిన్లు వినియోగం అయ్యాయని కేంద్రం చెబుతోంది. ఇప్పటి వరకు 1,18, 51, 393 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దేశంలో అత్యధిక కేసులు నమోదౌతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.