Jun 11,2021 06:50

''మరి ప్రాచీన వైద్య పరిజ్ఞానం మీద అంత గౌరవం ఉన్న ప్రధాని కరోనా రాకుండా 'కరోనిల్‌' తీసుకునే బదులు వ్యాక్సిన్‌ ఎందుకు వేయించుకున్నాడు స్వామీ? ఇదేనా ప్రాచీనతకి ఇచ్చే గౌరవం?''
''నాయనా! నీకు నరేంద్ర తత్వం బోధించాల్సిన సమయం వచ్చింది. మేము మా వరకూ వస్తే అన్ని ఆధునిక వసతులను పొందుతాము. ఆధునిక విజ్ఞానాన్ని అందరికన్నా ముందు ఉపయోగించబట్టే కదా సోషల్‌ మీడియాలో పైచేయి సాధించగలిగాము. ఆధునిక వైద్యాన్నే చేయించుకుంటాం. కాని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు పాలకులు ఎప్పుడూ భౌతికవాద పద్ధతులనే అనుసరించాలి. కాని ప్రజలను మాత్రం ఎప్పుడూ భావవాదంలో నుంచి బైటకు రాకుండా జాగ్రత్త పడాలి. అందుకే ప్రాచీనత గురించి గొప్పగా చెప్తాం.
(ఉపనిషత్‌ అంటే చాలా కొద్దిమంది, వీలైతే ఇద్దరే రహస్యంగా కూచుని వారిద్దరికి మాత్రమే వినిపించేలా చర్చించుకోవడం. పూర్వకాలంలో ఆ విధంగా బ్రహ్మ జ్ఞానం గురించి చర్చించు కునేవారు. ఆ చర్చల సారాంశాన్నే ఉపనిషత్తులు అన్నారు)
''గురువు గారూ! రాందేవ్‌ బాబా 'కరోనిల్‌' అన్న పేరుతో తయారు చేసి, దానితో కరోనా రోగాన్ని నయం చేయవచ్చునని ప్రచారం చేసి బాగా వ్యాపారం చేసుకున్నాడు కదా ? ''
''శిష్యా! అది ఆ రాందేవ్‌ బాబా తన బుద్ధి కుశలతతో సాధించిన విజయం నాయనా. మన ప్రాచీన వైద్యాన్ని, దాని విశిష్టతను వెలుగులోకి తెచ్చాడు కదా నాయనా. అది మన కర్మభూమి గొప్పదనం కాదా ? అందుకు గర్వపడు నాయనా''
''మరి ఆ 'కరోనిల్‌' కరోనాను నయం చేయదని ఆయుష్‌ విభాగం వారే చెప్పారు కదా స్వామీ''
''అవును నాయనా, అది ఆయుష్‌ విభాగం విద్యుక్త ధర్మం కదా. వారు దానిని చక్కగా నిర్వహించారు. చూశావా, ఈ ప్రభుత్వ పాలన ఎంత ధర్మబద్ధంగా నడుస్తోందో ''
''మరి పని చేయని 'కరోనిల్‌' ను సమర్ధిస్తున్నదీ మన ప్రభుత్వాలే కదా స్వామీ? ఇంతకూ రాందేవ్‌ బాబా కరెక్టా? లేక ఆయుష్‌ విభాగం వారు కరెక్టా? చెప్పండి స్వామీ !''
స్వామీజీ మౌనముద్ర లోకి వెళ్ళిపోయారు. కొతసేపు ఆగి మళ్ళీ శిష్యుడు సందేహాలు అడగడం ప్రారంభించాడు.
''కోవిడ్‌-19 అనే అంటువ్యాధి ఒక రకం కరోనా వైరస్‌ వలన వస్తుంది అని ముందుగా కనుగొన్నది ఎవరు స్వామీ? ప్రాచీన ఆయుర్వేద వైద్యులా? లేక ఆ పేరు చెప్పి ప్రస్తుతం వైద్యం సాగిస్తున్న వారా? ఆ వైరస్‌ ఏవిధంగా ఒకరినుండి మరొకరికి వ్యాపిస్తుందో ముందు కనుగొని ప్రపంచాన్ని హెచ్చరించి జాగ్రత్త పడమని చెప్పింది ఆధునిక అల్లోపతి వైద్యమా లేక ఆయుర్వేదమా స్వామీ? ''
''ఆధునిక అల్లోపతి వైద్యమే అనుకో. కాని.......''
''మామూలుగా ఒక వ్యాక్సిన్‌ ను కనుక్కోడానికి మూడు, నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఒక్కోసారి అంతకన్నా కూడా ఎక్కువ కాలమే పడుతుంది. అలా కనుగొన్న దానిని పరీక్షించి నిగ్గు తేల్చడానికి ఇంకో రెండేళ్ళయినా పడుతుంది. అలాంటిది ఒక్క ఏడాదిలోనే ప్రపంచంలో 140 రకాల వ్యాక్సిన్‌ లను కనుగొన్నది ఆధునిక అల్లోపతి వైద్యమా లేక ప్రాచీన వైద్యమా? చెప్పండి స్వామీ?''
(గురువుగారు మౌనముద్ర నటిస్తున్నారు. భక్తులు దానినే ధ్యానం అంటారు )
''పోనీ, ఈ కాలంలో కరోనాపై పోరాటంలో ఆయుర్వేదం గాని, హోమియో గాని, ప్రకృతి వైద్యం గాని, యోగా కాని కొత్తగా కనుగొన్నది ఏమైనా ఉన్నదా స్వామీ ? ''
(కొనసాగుతున్న గురువుగారి మౌనం)
''గురువుగారూ, సమాధానాలు చెప్పడం మానేసి మీరిలా మౌనం పాటిస్తే ఇక మీ గురుత్వం చెల్లకుండా పోతుంది. మన ఉపనిషత్తుల్లో ఏ గురువూ శిష్యుడి సందేహాలను తీర్చకుండా విడిచిపెట్టలేదు, అంచేత మీరు చెప్పాల్సిందే.''
''ఇప్పుడు కొత్తగా అడుగు నాయనా, సందేహం తీరుస్తాను ''
మీ అధినేత మోడీగారు స్వయంగా భారత బయోటెక్‌ ని, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ని సందర్శించి అక్కడ శాస్త్రవేత్తలను అభినందించారా లేదా?''
''అవును నాయనా, అది ఆయనకు శాస్త్రవేత్తల పట్ల ఉన్న అపార గౌరవం. ఆ మధ్య చంద్రయాన్‌ ప్రయోగం జరిగినప్పుడు కూడా వెళ్ళారు కదా. ''
''జనవరి 16న వ్యాక్సిన్‌ దేశంలో మొదటగా విడుదల చేస్తూ కరోనాను భారతదేశం జయించింది అని చెప్పింది కూడా మీ అధినాయకుడే కదా ?''
''అవును నాయనా. ఆ తర్వాత ఆయన కూడా వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేయించుకున్నారు కదా''
''మరి ప్రాచీన వైద్యం గొప్పదని, ఏనుగు తలకాయని మనిషికి అతికించగలిగినంత శక్తి కల ప్లాస్టిక్‌ సర్జన్లు మన దేశంలో ఉండేవారని, స్టెమ్‌సెల్‌ టెక్నాలజీతో ఒక పిండం నుండి వంద మంది కౌరవులు పుట్టుకొచ్చారని ఇలా చెప్పిందీ ఆయనే కదా?''
''అది మన ప్రాచీన శాస్త్రం గొప్పదనం కదా నాయనా''
''మరి ప్రాచీన వైద్య పరిజ్ఞానం మీద అంత గౌరవం ఉన్న ప్రధాని కరోనా రాకుండా 'కరోనిల్‌' తీసుకునే బదులు వ్యాక్సిన్‌ ఎందుకు వేయించుకున్నాడు స్వామీ? ఇదేనా ప్రాచీనతకి ఇచ్చే గౌరవం?''
''నాయనా! నీకు నరేంద్ర తత్వం బోధించాల్సిన సమయం వచ్చింది. మేము మా వరకూ వస్తే అన్ని ఆధునిక వసతులను పొందుతాము. ఆధునిక విజ్ఞానాన్ని అందరికన్నా ముందు ఉపయోగించబట్టే కదా సోషల్‌ మీడియాలో పైచేయి సాధించగలిగాము. ఆధునిక వైద్యాన్నే చేయించుకుంటాం. కాని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు పాలకులు ఎప్పుడూ భౌతికవాద పద్ధతులనే అనుసరించాలి. కాని ప్రజలను మాత్రం ఎప్పుడూ భావవాదంలో నుంచి బైటకు రాకుండా జాగ్రత్త పడాలి. అందుకే ప్రాచీనత గురించి గొప్పగా చెప్తాం. వేదాల్లో ఏముందో తెలియకపోయినా, అంతా వేదాల్లోనే ఉంది అని అంటూవుంటాం. ఎవడన్నా ఏదైనా కొత్తగా కనిపెట్టినా, ఇది మా వేదాల్లో ఎప్పుడో చెప్పేశారు అంటాం. అవన్నీ ఆ వేదాల్లో ఎక్కడున్నాయో వెతుక్కుంటూ కొందరు ఆ పనిలో మునిగిపోతారు. ''ఇంత గట్టిగా చెప్తున్నారంటే ఉండే వుంటుంది'' అని మేం చెప్పింది ఎక్కువమంది నమ్ముతారు. అలా నమ్మకుండా మమ్మల్ని నిలదీసి ప్రశ్నించేవాళ్ళని మేం విదేశీ ఏజంట్లని, చైనా భక్తులని, పాకిస్తాన్‌ టెర్రరిస్టులని, బొత్తిగా దేశభక్తి లేనివాళ్ళని ఇలా నానా రకాలుగా ముద్ర వేస్తాం. ఈ బాధ భరించలేక చాలామంది మేం చెప్పినదానిని ఒప్పేసుకుని మా లైన్లో పడతారు. మా పాలన అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది''
''ఓహో! అందుకేనా స్వామీ ఇటీవల మీ శిష్యులు కొందరు ఆంధ్రప్రదేశ్‌ లో ఆనందయ్య మందును ప్రశ్నించిన వారంతా కార్పొరేట్‌ ఆస్పత్రుల బ్రోకర్లని నిందిస్తున్నారు?''
''సూక్ష్మగ్రాహివిరా డింభకా! నువ్వు, బాగా తెలుసుకున్నావు. వృద్ధిలోకి వస్తావు''
''కాని, స్వామీ, ఆర్నెల్లుగా దేశ రాజధాని దగ్గర ఆందోళన చేస్తున్న రైతులు ఎందుకు మీ లైన్లో పడడం లేదు? ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బెంగాల్లో, కేరళలో ఎందుకు ఖంగు తిన్నారు? 'కరోనాను భారత్‌ జయించింది' అని మోడీ ప్రకటించిన నెల్లాళ్ళలోనే ప్రపంచంలోకెల్లా అత్యధిక కేసులు భారత్‌ లోనే ఎందుకు నమోదవుతున్నాయి? ఏడేళ్ళ క్రితం వరకూ ప్రపంచానికే సరిపడా వ్యాక్సిన్‌ లను ఉత్పత్తి చేయగలిగిన మన దేశంలో ఇప్పుడు మన ప్రజలకే వ్యాక్సిన్‌ ఎందుకు తయారు కావడంలేదు?''
''మూర్ఖుడా! ఎవడివిరా నువ్వు? ఎవరక్కడ! ఈ దేశద్రోహిని వెంటనే బంధించండి''.

సుబ్రమణ్యం