Jun 13,2021 06:56

   చైనాలో కరోనా కట్టడికి ఇప్పటివరకు మూడు రకాల వ్యూహాలను అనుసరించారు. వైరస్‌ బయటపడగానే దానికి చికిత్స ఏమిటో తెలియలేదు గనుక తొలి దశలో ప్రజారోగ్య నిరోధం మరియు అదుపు పద్ధతులను అమలు జరిపారు. రెండవ దశలో వ్యాక్సిన్లను ఉపయోగించారు. ఇప్పుడు మూడవ దశలో నిరోధం మరియు అదుపు పద్ధతులను కూడా పాటిస్తున్నట్లు చైనా సిడిసి అధిపతిగా గతంలో పని చేసిన జెంగ్‌ గ్వాంగ్‌ చెప్పారు.
కరోనా వైరస్‌ గురించి చేసిన తప్పుడు ప్రచారాల్లో వెయ్యో వంతు...ఆ వైరస్‌ నివారణ, అంతానికి చైనా సర్కార్‌ తీసుకుంటున్న చర్యల గురించి రాసినా ప్రపంచానికి ప్రయోజనం ఉండేది. అక్కడ అనుసరిస్తున్న పద్ధతులను ఎందుకు అమలు చేయరంటూ ఆయా దేశాల జనాలు పాలకుల మీద ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉండేది.
   వరల్డో మీటర్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఇది రాసిన సమయానికి ప్రపంచంలో మొత్తం కరోనా కేసులు 17 కోట్ల 56 లక్షల 79 వేల 912. మరణించిన వారు 37 లక్షల 90 వేల 392 మంది. మన దేశానికి సంబంధించి మొత్తం కేసులు రెండు కోట్ల 92 లక్షల 74,823. మరణాలు 3,63,097. కేసుల సంఖ్యలో అమెరికా తరువాత రెండవ స్ధానంలో ఉంది, మరణాల్లో అమెరికా, బ్రెజిల్‌ తరువాత మూడవ స్ధానం. మొత్తం 222 దేశాలు, ప్రాంతాలలో చైనా 98వ స్ధానంలో ఉంది. అక్కడ నమోదైన కేసులు 91,359. మరణాలు 4636.
   తాజాగా ప్రపంచ మీడియాలో వచ్చిన ఒక వార్త మరోసారి చైనా కరోనా కట్టడి గురించి ఆసక్తి రేపింది. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ఝౌ అనే పట్టణం, పరిసరాల జనాభా కోటీ 86 లక్షలు. ఒక మహిళ (75) ఒక హోటల్‌కు వెళ్లినపుడు కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు మే నెల 21 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు నగరంలో కోటీ 80 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 115 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి, 106 మందికి నిర్ధారణ అయింది. ఈ కేసులన్నింటిలో భారత్‌లో బయటపడిన డెల్టా రకం కనిపించింది. ఇది వేగంగా వ్యాపించే లక్షణం కలిగినదని చైనా అధికారులు చెప్పారు. ఒక గంట లోపే ఫలితాన్ని వెల్లడించే న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టులు చేశారు. రక్తం, కండరాలు, మూత్రంలో ఏవైనా వైరస్‌, బ్యాక్టీరియాలు ఉంటే వెంటనే పసిగట్టే ఆధునిక పరిజ్ఞానంతో ఆ పరీక్షను చేస్తారు. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన పట్టణంగా రికార్డులకెక్కింది. గతంలో చైనా లోనే మరికొన్ని పట్టణాల్లో కూడా ఈ పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహించినా సంఖ్యరీత్యా ఇదే అత్యధికం. వాన్‌ఫు బయోటెక్నాలజీ అభివృద్ధి చేసిన విధానం ప్రకారం బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలలో బయటపడిన కరోనా వైరస్‌ లక్షణాలను ఈ పరీక్ష వెల్లడిస్తుంది. గ్వాంగ్‌ఝౌ పట్టణం, పరిసరాలలో 5,500 బయో, ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు, ఈ రంగంలోనే వెయ్యి ఆధునిక పరిజ్ఞాన సంస్ధలు ఉన్నాయి. కింగ్‌మెడ్‌ డయాగస్టిక్స్‌ గ్రూప్‌ రోజుకు మూడున్నర లక్షల పరీక్షలు చేయగల సామర్ధ్యం కలిగినది ఇక్కడ ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.
   చైనాలో కరోనా కట్టడికి ఇప్పటివరకు మూడు రకాల వ్యూహాలను అనుసరించారు. వైరస్‌ బయటపడగానే దానికి చికిత్స ఏమిటో తెలియలేదు గనుక తొలి దశలో నిరోధం మరియు అదుపు పద్ధతులను అమలు జరిపారు. రెండవ దశలో వ్యాక్సిన్లను ఉపయోగించారు. ఇప్పుడు మూడవ దశలో నిరోధం మరియు అదుపు పద్ధతులను కూడా పాటిస్తున్నట్లు చైనా సిడిసి అధిపతిగా గతంలో పని చేసిన జెంగ్‌ గ్వాంగ్‌ చెప్పారు. ఈ చర్యలతో పాటు వాటిని అమలు జరిపే క్రమంలో చైనీయుల సామాజిక అలవాట్లను, అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నారు. గ్వాంగ్‌ఝౌ నగరంలో కేసులు 115 మాత్రమే బయటపడినప్పటికీ కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ప్రకటించి జన సంచారాన్ని పరిమితం చేశారు. చైనాలో అనేక సంస్ధలు వ్యాక్సిన్ల తయారీకి పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఏడు రకాలకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 80 కోట్ల మందికి తొలి, రెండవ డోసు వ్యాక్సిన్లు వేసినట్లు చైనా ప్రకటించింది.
    గత ఏడాది ఊహాన్‌ నగరంలో కరోనాను కట్టడి చేయటం అనేక అనుభవాలను ముందుకు తెచ్చింది. తరువాత కాలంలో చెదురుమదురుగా వివిధ నగరాల్లో చాలా పరిమితంగా అయినా కేసులు బయటపడ్డాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా వైరస్‌ విస్తరించకుండా చూసేందుకు నూక్లియక్‌ యాసిడ్‌ పరీక్షలు చేసి జల్లెడ పట్టాలని నిర్ణయించారు. దీనికి కూడా ఊహాన్‌ అనుభవమే తోడ్పడింది. అక్కడ ప్రారంభంలో యాభై వేల పరీక్షలు చేసి సమాచారాన్ని విశ్లేషించారు. తరువాత గతేడాది మే నెల ప్రారంభంలో అక్కడి కోటి మంది జనాభాకు పది రోజుల్లో ఈ పరీక్షలు చేసి దాగున్న వైరస్‌ను వెలికి తీసే యత్నం చేశారు. లక్షణాలు బయటకు కనిపించకుండా వైరస్‌ ఉన్న మూడు వందల కేసులు వెల్లడయ్యాయి. తరువాత బీజింగ్‌ లోని కోటి ఇరవై లక్షల మందికి పరీక్షలు చేశారు. 174 కేసులు బయటపడ్డాయి.
    చైనాలో ప్రయాణాలు చేసే వారు గణనీయ సంఖ్యలో ఉంటారు. ప్రతివారినీ ప్రతి చోటా పరీక్షించటం సాధ్యం కాదు. అవసరమైన సిబ్బంది లభ్యత కూడా పెద్ద సమస్యే. అందువలన చైనా ప్రయాణ ఆరోగ్య సూచిక (కోడ్‌) లను రూపొందించాలని ఐ.టి కంపెనీలను కోరారు. ఆమేరకు తయారు చేసి ప్రతి ఒక్కరికీ ఒక సూచికను కేటాయించారు. వారి సెల్‌ఫోన్లలో యాప్‌ ఏర్పాటు చేశారు. దానిలో మూడు రంగుల సూచికలను పొందుపరిచారు. దానిలో సదరు వ్యక్తి చిరునామా వంటి ప్రాథమిక సమాచారంతో పాటు అనుమతించిన ఆరోగ్య వివరాలు, సందర్శించిన ఆసుపత్రులు, వాడిన మందుల వంటి వాటిని పొందుపరిచారు. అంతే కాదు, వారు పర్యటించిన ప్రాంతాలు, హోటళ్లు, మాల్స్‌, రైలు, విమానం, బస్‌, స్వంత వాహనం వంటి వివరాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా తనిఖీ సిబ్బంది ఫోన్లలో వారి కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు ఆకుపచ్చ సూచిక ఉన్నవారి వివరాలను చూస్తే వారు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు లేవని, కరోనా ప్రాంతాల్లో సంచరించలేదని అర్ధం. పసుపు పచ్చ కోడ్‌ వస్తే వారు శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారని, కరోనా ముప్పు ప్రాంతాలను సందర్శించటం, వైరస్‌ సోకిన వారితో కలిసినట్లు అర్ధం. ఎరుపు సూచిక ఉంటే ప్రమాదం ఉందని అర్ధం. వారికి లేదా కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకటం, సోకినవారిని కలిసినందున విడిగా ఉంచాల్సిన అవసరం ఉందని అర్ధం. కరోనాను మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించినందున పసుపు, ఎరుపు సూచికలు ఉన్న వారికి ప్రయాణించేందుకు అవసరమైన టిక్కెట్లను తిరస్కరించే, ప్రయాణ అనుమతి నిరాకరించే అధికారం యంత్రాంగానికి ఉంటుంది. ఆకుపచ్చ సూచిక ఉన్నవారు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.
    కరోనా నివారణకు వ్యాక్సిన్‌ రూపొందించే వరకు ఫలానా ఔషధంతో నివారించవచ్చనే హామీ ఎక్కడా లేదు. అనేక రకాల ప్రయోగాలు చేశారు. చైనాలో మన ఆయుర్వేదం మాదిరే స్ధానిక వైద్య పద్ధతిలో వాడుతున్న ఔషధాలను కూడా చికిత్సలో ఉపశమనానికి వినియోగించారు. ఆ రంగ నిపుణులను కూడా అల్లోపతి ఆసుపత్రుల్లో నియమించారు. పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ వైద్య పద్ధతి, ఔషధం వైరస్‌ను అంతం చేస్తుందనే భ్రమలు కల్పించలేదు. కనుకనే అక్కడ బాబా రామ్‌దేవ్‌ వంటి వారు వాటితో సొమ్ము చేసుకోవటం గానీ, ఆనందయ్య పచ్చడి వంటివి రంగం లోకి రావటం గానీ జరగలేదు.
    ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న కారణంగానే చైనాలో వైరస్‌ అదుపులో ఉంది. అయితే ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది కనుక దేశ సంపదలను జనం కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు. లాభనష్టాల లెక్కలు వేసుకోలేదు. ముందు ప్రాణాలను రక్షించటమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. కేసులు తక్కువే అయినప్పటికీ చైనాలో ఖర్చు తక్కువేమీ కాలేదు. దానికంటే ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవటం పెద్ద దెబ్బ అని వెంటనే గ్రహించింది. అందుకే ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్ధలున్న దేశాల్లో ఎక్కడా లేనివిధంగా వైరస్‌ కనిపించిన నాలుగు నెలల్లోనే దాన్ని అదుపులో ఉంచి ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ పునరుద్ధరించింది. అది ఖర్చు కంటే లబ్ధే ఎక్కువ చేకూర్చిందని రుజువైంది. దాన్నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా? మన భుజాలను మనమే చరుచుకుంటామా ?
 

ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు