Apr 14,2021 21:49

అమరావతి బ్యూరో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు ప్రజా సమూహాలపై నిషేధాజ్ఞలు విధించాలని ఎపి పౌరహక్కుల సంఘం (ఎపిసిఎల్‌ఎ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఎపిసిఎల్‌ఎ నిర్వహించిన వెబినార్‌లో వక్తల అభిప్రాయాలపై సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేష్‌కుమార్‌ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమూహాల విషయంలో షరతులు, నిషేధం విధించని కారణంగానే కరోనా వ్యాప్తి చెందుతుందని వక్తలు అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. కరోనా పరీక్షల సంఖ్య గతంలో 60 వేలు ఉంటే దాన్ని ప్రభుత్వం 30 వేలకే పరిమితం చేసినట్లు కనబడుతోంది తెలిపారు. కరోనా రెండో దశలో లక్షణాలు కనబడకపోయినా చాలా మంది ప్రాణాలు కల్పోతున్నారని, తక్షణమే కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా వ్యాక్సిన్ల కొరతను నివారించేందుకు, అడిగిన వారందరికీ వ్యాక్సిన్లు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.