Nov 22,2020 17:15

కరోనా ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దేశాలకు దేశాలే వణికిపోతున్నాయి. ఈ యుగంలో చూడని అతి భయంకరమైన విపత్తు ఇది. ప్రపంచంలో నేటి వరకూ కోట్లాది మంది కరోనా బారినపడ్డారు. లక్షలాది మంది మృత్యువుతో పోరాడి పోరాడి తుదిశ్వాస విడిచారు. 'ఆరోగ్యశ్రీ' పేరుతో వేల కోట్లు కొల్లగొట్టిన కార్పొరేట్‌ వైద్యశాలలు విపత్తు సమయంలో ఏమీ చేయలేమని మూసేసి.. కూర్చున్నాయి. అక్కడక్కడా ప్రభుత్వ వైద్యశాలలు మాత్రమే కరోనా సేవలందించాయి. కొన్నిరోజులకు దీన్నీ వ్యాపారం చేసుకునేందుకు కార్పొ'రేట్‌' వైద్యశాలలు తెరుచుకున్నాయి. కరోనా టెస్టుకే వేలల్లో వసూలు చేస్తూ.. కరోనా చికిత్సకు లక్షల్లో పిండేస్తున్నాయి. ఇక నిత్యం సాధారణ జబ్బులతో ఆస్పత్రుల చుట్టూ తిరిగే జనం పరిస్థితి అగమ్యగోచరం. తమకు ఎవరు దిక్కు అనుకుంటున్న సమయంలో పేదలు, సాధారణ రోగులకు తామున్నామంటూ కరోనా కారుచీకట్లలో వెలుగు రేఖగా సేవలందించింది ఆ వైద్యశాల. వైద్యవృత్తిని కాసుల కోసం కాకుండా, పేదలకు సేవలు అందించేందుకే తమ జీవితాల్నే అంకితం చేసిన డాక్టర్‌ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి స్ఫూర్తితో.. ఏడొందల మంది వైద్యులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు. పేదలకు వైద్య సేవలందించే విషయంలో ఎవరెస్టంత ఎత్తుఎదిగిన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని డాక్టర్‌ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ఆవశ్యకత కరోనా కాలంలో మరింత పెరిగింది. ఈ విపత్తు వేళ.. అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు సేవలందించడం ఎలా అనేదే ఈ వారం అట్టమీది కథనం.       

     డాక్టర్‌ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల పేరు తెలియనివారు చాలా అరుదు. సాధారణ జబ్బుతో హాస్పిటల్‌లోకి రోగి వచ్చినా లక్షలు గుంజేసే వైద్యశాలలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ అందుకు పూర్తి భిన్నమైంది ఈ ప్రజా వైద్యశాల. తక్కువ ఖర్చుతో ప్రజలకు వైద్య సేవే పరమావధిగా ముందుకెళ్తోంది.
        పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది మార్చి 8న రాష్ట్రంలోనే తొలి కరోనా కేసు నమోదైంది. అదే సమయంలో పొగతోటకు చెందిన డాక్టర్‌ ఒకరు కరోనాతో చికిత్స పొందుతూ చెన్నరులో మృతి చెందారు. అంతే ! డాక్టర్లలో ఒక్కసారిగా భయం మొదలైంది. అప్పటికే ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. కరోనా కేసులను చూడటానికి ప్రభుత్వాసుపత్రితో పాటు మరో ఆసుపత్రికి మాత్రమే అనుమతినిచ్చి, ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అక్కడ కరోనా రోగులకు మాత్రమే వైద్యం అందించడం ప్రారంభించారు. ఇంతటితో తమ బాధ్యత తీరిపోయిందని ప్రభుత్వం భావించింది. అప్పటికే ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. బయట తిరగడానికి అవకాశం లేదు. జిల్లా అంతటా కర్ఫ్యూ వాతావరణం. కరోనా కేసుల చూడడానికి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి, నారాయణ వైద్యశాలను ఎంపిక చేశారు. ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా సాధారణ జబ్బులతో ఉన్న రోగులు కనీసం 25 వేల మంది నెల్లూరు ఆసుపత్రులకు వస్తుంటారు. కరోనా భయంతో 90 శాతం ఆసుపత్రులు మూసేశారు. అత్యవసర కేసులను చూసే వారే కరువయ్యారు. అలాంటి సమయంలోనే 'మేమున్నాం' అంటూ ముందుకొచ్చింది పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల.
                                                   

                                                    అవసరాలు.. సౌకర్యాలు ...
           ఈ వైద్యశాలలో రెండొందల బెడ్స్‌ ఉన్నాయి. 15 మంది మహిళా వైద్యులు సహా 60 మంది వైద్యులు, సుమారు 400 మంది వైద్య సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో ప్రతిరోజూ నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 800 మంది వైద్య సేవలు ఇక్కడ అందుకున్నారు. 'సలహాలు, సూచనలకు మా డాక్టర్లతో మీరే నేరుగా మాట్లాడొచ్చు.. తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నవారు నేరుగా ఆసుపత్రికి రావచ్చు!' అని ఆసుపత్రి యాజమాన్యం పిలుపునిచ్చింది. ప్రతిరోజూ పిపిఇ కిట్లను డాక్టర్లు, సిబ్బందికి అందజేసింది. ప్రతి ఒక్కరికీ రెండు నెలలకు నాలుగు ఎన్‌95 మాస్క్‌లు, ప్రతినిత్యమూ ఆసుపత్రి ప్రాంగణమంతా శానిటైజేషన్‌ తప్పనిసరి చేసింది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. అన్ని ఓపిల వద్ద రోగుల మధ్య భౌతికదూరం ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంది. ఆసుపత్రికి వచ్చాక ఎవరికైనా జ్వరం ఉందని గుర్తిస్తే.. అలాంటివారి కోసం 25 పడకలతో 'ఫీవర్‌ క్లినిక్‌' ఏర్పాటు చేశారు. అనుమానం వస్తే ఆసుపత్రిలోనే కరోనా పరీక్షలూ నిర్వహించారు. అత్యవసరంగా 10 ఆక్సిజన్‌ ప్రత్యేక యంత్రాలు కొనుగోలు చేశారు. తమ కుటుంబాలు రిస్కులో పడతాయని తెలిసినా ఏ మాత్రం బెదరక వైద్య సిబ్బంది సేవలందించడం అభినందించాల్సిన విషయం. లాక్‌డౌన్‌ సమయంలో నెల్లూరు నగరంలో ఒక్క హోటల్‌ అందుబాటులో లేదు. రోగులూ, వారితో వచ్చిన బంధువులకు ఆసుపత్రి యాజమాన్యమే కొందరు దాతల సాయంతో ప్రతిరోజూ 150 మందికి మధ్యాహ్న, రాత్రి భోజన సదుపాయం కల్పించింది. వైద్య సిబ్బందికి అందించే రక్షణ కవచాలకు ఆసుపత్రి సిబ్బంది అక్షరాలా రూ.30 లక్షలు వెచ్చించింది. అయినా 15 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. కరోనా సమయంలోనే కాదు ఎప్పుడైనా ప్రజలకు వైద్య సేవలందించడానికి మేము సిద్ధంగా ఉంటామని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.
                                                     

                                                    కష్టకాలంలో మేమున్నాం !nityam hospitallo sanitization
          డాక్టర్‌ రామచంద్రారెడ్డి వైద్యశాల కేవలం నెల్లూరు నగరానికే పరిమితమై ఏనాడూ పనిచేయలేదు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు ఎప్పుడు కష్టమొచ్చినా 'మేమున్నాం !' అంటూ వైద్యసేవల్లో ముందుంటోంది. విష జ్వరాలు ప్రబలినప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి ఇక్కడి వైద్యులు సేవలు అందించారు. వందలాది కార్యకర్తలకు ప్రాథమిక వైద్య శిక్షణ ఇప్పించి, స్థానిక వైద్యాన్ని బలోపేతం చేశారు. దివిసీమ ఉప్పెన వచ్చిన సమయంలో.. అక్కడ అంటువ్యాధులు ప్రబలిన సమయంలో.. నెల్లూరు నుంచి వైద్య బృందం వెళ్లి మరీ సేవలందించారు. కర్నూలు, ఒడిశా, కేరళ వరదల సమయంలో నెల్లూరు నుంచి ప్రజా వైద్యశాల సిబ్బంది వెళ్లి, వైద్య సేవలు అందించారు.

                                                                                - పి. బాలకృష్ణ
                                                                                9490099276

 

                                                   

                                                  ఇదే ప్రజా వైద్య ప్రస్థానం..! dr.rama chandra reddy praja vaidyasala

      క్షిణ భారత కమ్యూనిస్టుపార్టీ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య సోదరులు డాక్టర్‌ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి. నెల్లూరు నగరం బారకాసు వద్ద 1941లో ప్రజావైద్యశాలను స్థాపించారు. అతి తక్కువకాలంలోనే ప్రజలకు ఇది చేరువైంది. కొంతకాలం తర్వాత శస్త్రచికిత్సలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మద్రాసు వెళ్లి స్టాల్‌నీ ఆసుపత్రిలో వైద్యులుగా చేరారు. శస్త్ర చికిత్స ప్రముఖులు ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాఘవాచారి దగ్గర సర్జరీలు చేయడంలో నైపుణ్యం సంపాదించుకున్నారు. మద్రాసు నుంచి తిరిగొచ్చిన ఆయన 1950లో శంకరాగ్రహారంలో ఆసుపత్రిని ప్రారంభించారు. 1953లో డాక్టరు ఆంజనేయులు, డాక్టర్‌ పి.వి రామచంద్రారావు, డాక్టర్‌ రామదాసును వైద్యులుగా చేర్చుకొని, ఆస్పత్రిని విస్తృతపరిచారు. ''పీపుల్స్‌ పాలీ క్లినిక్‌'' పేరుతో 1953లో సొసైటీ యాక్ట్‌ కింద ఆసుపత్రిని రిజిస్టర్‌ చేయించారు.
       ఎంబిబిఎస్‌ పూర్తి చేసుకున్న వెంటనే డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి, మరికొన్ని రోజుల్లోనే ఆయన సతీమణి వింధ్యావళి ఆసుపత్రిలో చేరి, సేవలందించడం ప్రారంభించారు. మరికొంత కాలానికి ఆత్మకూరుకు చెందిన చెర్లో రమణారెడ్డి వైద్యులుగా చేరారు.
                                                   

                                                          ప్రజా ఉద్యమాల్లోనూ..
       వైద్య సేవలు అందించడంలోనేకాక ప్రజా ఉద్యమాల్లోనూ వైద్యులు ముందుండి, నడిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కూడా అందండం లేదని గమనించిన వైద్యులు 1954 నుంచి యువజన కార్యకర్తలకు అనేక దశలుగా వైద్యంలో శిక్షణ అందించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర్టవ్యాప్తంగా కొన్ని వేల మంది యువత ప్రాథమిక వైద్యులుగా తీర్చిదిద్దబడ్డారు. ప్రజా ఉద్యమాల్లో డాక్టర్‌ రామచంద్రారెడ్డి, డాక్టర్‌ శేషారెడ్డి అరెస్ట్‌ అయిన సమయాల్లో డాక్టర్‌ రమణారెడ్డి, డాక్టర్‌ దశరథరామిరెడ్డి, వింద్యావళి ఆసుపత్రిని నడిపించేవారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటే అరెస్టులు, జైలుకెళ్లడం వల్ల పేదలకు వైద్యసేవలందించడం ఇబ్బందిగా ఉందని గ్రహించిన పుచ్చలపల్లి సుందరయ్య వీరిని ఆసుపత్రికే పరిమితం చేశారు. 1967 ఏప్రిల్‌ 18న డాక్టర్‌ రామచంద్రారెడ్డి చనిపోయారు. అప్పటి నుంచి ఆసుపత్రి పేరును డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలగా మార్పు చేశారు.
                                                   

                                                       అభివృద్ధి పథంలో..ppc medicals
       పేద ప్రజల కోసం పనిచేస్తున్న ఈ ఆసుపత్రిలో పనిచేయడానికి ఎందరో డాక్టర్లు ఉత్సాహం చూపుతారు. వైద్యం వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో పేదలకు వైద్య సేవలందిస్తున్న ఏకైక ఆసుపత్రిగా ఈ వైద్యశాల పేరొందింది. 1967 నుంచి 2008 వరకు ఆసుపత్రి బాధ్యతలను డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. ఆయన పర్యవేక్షణలో ఆసుపత్రి మరింత విస్తరించింది. 200 పడకలకు పెరిగింది. ఆరు ఆపరేషన్‌ ధియేటర్లు, 17 బెడ్ల ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు ఏర్పాటుచేశారు. నర్సింగ్‌ స్కూలు నడుస్తోంది. ఇదంతా శేషారెడ్డి, ఇతర డాక్టర్ల, సిబ్బంది కృషి వల్లే సాధ్యమైంది. 2008 జూన్‌ 11న శేషారెడ్డి చనిపోయారు. రామచంద్రారెడ్డి, శేషారెడ్డి స్ఫూర్తితో అంకితభావం గల వైద్యులు, సిబ్బంది ఆసుపత్రికి ఆ లోటు లేకుండా ముందుకు తీసుకుపోతున్నారు. డాక్టర్లు జె. ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌.రవీంద్ర, పి.అజరుకుమార్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్లుగా పనిచేశారు. ప్రస్తుతం డాక్టర్‌ రాజేశ్వరరావు సూపరింటెండెంట్‌ బాధ్యతలు చూస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చి, రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రజావైద్యశాలగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల

.ppe kitlato seva sibbandi
        కరోనా సమయంలో కార్పొరేట్‌ వైద్యశాలలు వ్యాపార దృక్పథంతో వైద్యానికి దిగాయి. ఒక్కో రోగి దగ్గర నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు వరకూ వసూలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని పేద, మధ్యతరగతి ప్రజలకు సేవచేస్తోంది డాక్టర్‌ రామచంద్రారెడ్డి ఆసుపత్రి. అక్కడ సేవచేస్తున్న వారందరికీ సెల్యూట్‌ చేయాల్సిందే !out patientlu

                                                   

                                                       

                                                    ఆన్‌లైన్‌ వైద్యసేవలందించాం !
        రోనా సమయంలో ఆస్పత్రిలో విస్తృతమైన సేవలందించాం. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ ద్వారానూ విస్తృతంగా వైద్యసేవలు అందించాం. మా ఆసుపత్రి సిబ్బందితో పాటు, 20 మంది వైద్యులు, 30 మంది వాలంటీర్లను ఇందుకోసం ఉపయోగించాం. జిల్లా వ్యాప్తంగా కరోనా రోగులకు సలహాలు, సూచనలు ఇచ్చాం. రాష్ట్ర స్థాయిలో నాన్‌ కోవిడ్‌ వైద్య సలహాలు, సూచనలు అందించాం. ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బందితో పాటు ప్రజారోగ్యవేదిక కార్యకర్తలు ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు.

.Dr.mv ramanaiah
 డాక్టర్‌ ఎంవి రమణయ్య

ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు


                                                    ఒక్కరోజూ మూయలేదు !
           డాక్టర్‌ రామచంద్రారెడ్డి, డాక్టర్‌ శేషారెడ్డే మాకు స్ఫూర్తి. వారు చూపిన మార్గంలోనే వెళుతున్నాం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మా కనీస బాధ్యత. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పటివరకు ఒక్కరోజు కూడా ఆసుపత్రి మూయలేదు. మరింత బాధ్యతగా ఇక్కడ డాక్టర్లు, సిబ్బంది పనిచేస్తున్నారు. మాలో కొందరికి కరోనా సోకినా మరింత ధైర్యంగా ముందుకెళ్తున్నాం. తొలిరోజు నుంచి ఇప్పటివరకు సాధారణ జబ్బులు, అత్యవసర కేసులకు ఆసుపత్రిలో నిరంతరాయంగా వైద్యం కొనసాగుతూనే ఉంది

.Dr.b.rajeswar rao

డాక్టర్‌ బి. రాజేశ్వరరావు, సూపరింటెండెంట్‌