
ప్రజాశక్తి-గుంటూరు :ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అక్టోబర్ 14 నాటికి పెరిగిన విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని, క్రమబద్దీకరణలో అసంబద్ధతలను సవరించాలని డిఇఒ ఆర్.ఎస్.గంగాభవానీకి యుటిఎఫ్ నాయకులు ప్రతినిధ్యం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి తేడాలూ లేకుండా రేషనలైజేషన్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర సహాధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు ఉన్నారు.
ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు వినతి : రేషనలైజేషన్ నిబంధనలు మార్పు చేసి, ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని యుటిఎఫ్ నాయకులు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు మెమోరాండం అందచేశారు.
సర్వీసు పాయింట్లు కేటాయించాలి
డిఎస్సీ-2008 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు బదిలీల్లో నష్టం జరగకుండా సర్వీసు పాయింట్లు కేటాయించాలని డిఈఒకు యుటిఎఫ్ నాయకులు ప్రాతినిధ్యం చేశారు. 2008లో ఉద్యోగానికి ఎంపికైన ఉపాధ్యాయులు ఖాళీలు లేకపోవటంతో హామీ పత్రాలు పొంది, ఖాళీలు ఏర్పడిన క్రమంలో నియామకం పొందారని, సీనియారిటీ, ఇంక్రిమెంట్లు నష్టపోయామని కోర్టుకు వెళ్లిన నేపధ్యంలో కోర్టు వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని తీర్పు ఇచ్చిందన్నారు. కావున జిల్లా స్థాయిలో వారి సర్వీసును 2010 అక్టోబర్ 10 నుంచి పరిగణనలోకి తీసుకొని సర్వీసు పాయింట్లు ఇవ్వాలని కోరారు. డిఈఒను కలిసిన వారిలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్, కె.నాగమల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఆదినారాయణ, 2008 డిఎస్సీ ఉపాధ్యాయులు ఉన్నారు.