Dec 03,2021 19:58

ట్రోఫీని గెలుచుకున్న ఆంధ్ర టైగర్స్‌ టీమ్‌

ప్రజాశకి -విజయనగరం టౌన్‌ : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సీతం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో విజయనగరం యూత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర టైగర్స్‌ టీం విజేతగా నిలచి ట్రోఫీని కైవసం చేసుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, బెస్ట్‌ బ్యాట్స్‌మాన్‌ గా అప్పలరాజు నిలవగా టీమ్‌కు కెప్టెన్‌గా అప్పలరాజు వ్యవహరించారు. మొత్తం 15 ఓవర్లలో ఆంధ్ర టైగర్స్‌ 114 పరుగులు చేసి చండీఘర్‌ లయన్స్‌కు సవాల్‌ విసిరారు. చండీఘర్‌ లయన్స్‌ 88 పరుగులు చేసి ఓటమి పాలయ్యారు. ఈ టీమ్‌కు సతీష్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. విజయనగరం జిల్లాలో వికలాంగుల క్రికెట్‌ టోర్నమెంట్‌ జరగడం ఇదే మొదటిసారి. విజేతలకు లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, సీతం కళాశాల డైరెక్టర్‌ మజ్జి శశి భూషణరావు, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గురాన అయ్యలు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేసారు. అనంతరం క్రీడాకురులనుద్దేశించి భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ కోవిడ్‌ విజంభణ సమయంలో ఈ ఫౌండేషన్‌ సేవలు ఎనలేనివని, తద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగునింపారని అన్నారు. కోవిడ్‌ లోనే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న విజయనగరం యూత్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థల సహకారం సమాజానికి చాలా అవసరమని సీతం ఇంజనీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ మజ్జి శశిభూషణ్‌ రావు అన్నారు. యువత ఇటువంటి సేవలు చేసే వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గురాన అయ్యలు మాట్లాడుతూ వికలాంగుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో పౌండేషన్‌ అధ్యక్షులు షేక్‌ ఇల్తమాష్‌, కార్యదర్శి ఆంబులెన్స్‌ శివ, సభ్యులు అనిల్‌కుమార్‌, అశోక్‌, సమీర్‌, వంశీ పాల్గొన్నారు.