Sep 14,2021 19:41

కొలంబో: శ్రీలంక సీనియర్‌ పేసర్‌ లసిత్‌ మలింగ క్రికెట్‌ అన్ని రకాల ఫార్మాట్స్‌కు గుడ్‌బై చెప్పాడు. 38ఏళ్ల మలింగ మంగళవారం ట్విటర్‌ వేదికగా టి20 క్రికెట్‌తోపాటు అన్ని ఫార్మాట్స్‌నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు.. సుదీర్ఘ కెరీర్‌లో భాగంగా తనకు మద్దతునిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే యువ క్రికెటర్లతో తన అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని శ్రీలంక క్రికెట్‌బోర్డుకు ట్వీట్‌ చేశాడు. ఐపిఎల్‌కు జనవరి 2021 నుంచి దూరంగా ఉన్న మలింగ.. తాజాగా అన్నిరకాల ఫార్మాట్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. 2004లో ఆస్ట్రేలియాతో, టెస్టుల్లో అరంగేట్రం చేసిన మలింగ.. 2010 భారత్‌తో జరిగిన టెస్ట్‌ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక 2004లో యుఏఇతో మ్యాచ్‌ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేసి 2019లో బంగ్లాదేశ్‌తో వన్డే అనంతరం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 2006లో ఇంగ్లండ్‌తో టి20ల్లో అరంగేట్రం చేసిన మలింగ.. గత ఏడాది మార్చిలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ అనంతరం మరో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడలేదు. సెప్టెంబర్‌ 2019న న్యూజిలాండ్‌తో టి20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ మలింగ రికార్డు నెలకొల్పాడు. అలాగే టి20ల్లో హ్యాట్రిక్‌తోపాటు వరుసగా నాలుగు వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గానూ మలింగ మరో రికార్డు సాధించాడు. 30 టెస్టుల్లో 101, 226 వన్డేల్లో 338, 84 టి20ల్లో 107 వికెట్లు తీసిన మలింగ.. ఐపిఎల్‌ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్‌కు దీర్ఘకాలం పేస్‌ విభాగంలో సేవలందించాడు.