Jan 28,2021 11:37

న్యూఢిల్లీ : బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ను కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అరికట్టగలదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. బ్రిటన్‌ వైరస్‌ 70 శాతం అధిక వేగంతో వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఆవిష్కరించిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ఈ వైరస్‌ను కట్టడి చేయగలదని వెల్లడైంది. కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వ్యక్తుల నుంచి తీసిన బ్లడ్‌ సీరమ్‌తో బ్రిటన్‌ రకం వైరస్‌కు అడ్డుకట్ట వేయవచ్చని భారత్‌ బయోటెక్‌ తన ట్విటర్‌లో తెలిపింది. సోషల్‌మీడియాలో జీవశాస్త్రాల పరిశోధనా పత్రాలను ప్రచురించే వెబ్‌సైట్‌ 'బయోఆర్‌ఎక్స్‌ఐవీ' ఈ ఆర్టికల్‌ను ప్రచురించింది. 'కొవాగ్జిన్‌' వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తుల నుండి తీసుకున్న బ్లడ్‌ సీరమ్‌ను బ్రిటన్‌ వైరస్‌పై ప్రయోగించినపుడు.. ఆ వైరస్‌ తటస్థీకరణ (న్యూట్రలైజేషన్‌)కు గురికావడాన్ని గుర్తించినట్లు ఈ ఆర్టికల్‌లో భారత్‌ బయోటెక్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 'బయోఆర్‌ఎక్స్‌ఐవీ' లో వచ్చిన పరిశోధనా పత్రంపై స్పందిస్తూ.. బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌ను మొదటిసారిగా 'కల్చర్‌' చేసిన సంస్థ ఐసిఎంఆర్‌- ఎన్‌ఐవి మాత్రమేనని ఐసిఎంఆర్‌ ట్వీట్‌ చేసింది. దేశంలో విస్తరిస్తున్న సార్స్‌-కోవ్‌-2 వైరస్‌తో పాటు బ్రిటన్‌ రకం వైరస్‌ మీదా 'కొవాగ్జిన్‌' సమర్థవంతంగా పనిచేస్తోందని వివరించింది.