Jun 13,2021 08:02

న్యూఢిల్లీ : ది ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్‌స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఇఎస్‌ఐసి) పరిధిలో ఉండి, కోవిడ్‌-19తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉండేందుకు ఆ సంస్థ 'ఇఎస్‌ఐసి కోవిడ్‌-19 రిలీఫ్‌ స్కీమ్‌'తో ముందుకొచ్చింది. ఈ పథకం ప్రకారం, మరణించిన ఉద్యోగి సగటు వేతనంలో 90 శాతం సమానమైన పెన్షన్‌ పొందేందుకు బాధిత కుటుంబ సభ్యులు అర్హులని పేర్కొంది. మార్చి 24, 2020 నుంచి ఈ పథకం రెండు సంవత్సరాల కాలానికి అమలులోకి వస్తుంది. కరోనా నిర్ధారణ తేదీకి కనీసం మూడు నెలల ముందు ఇఎస్‌ఐ ఆన్‌లైన్‌ పోర్ట్‌లో నమోదై ఉండాలని తెలిపింది. వైరస్‌ బారిన పడే సమయానికి ఉద్యోగంలో ఉండాలని,వైరస్‌ నిర్ధారణకు ముందు గరిష్టంగా ఒక సంవత్సరం వ్యవధిలో 70 రోజుల కంట్రిబూషన్‌ చెల్లించబడి ఉండాలని పేర్కొంది. మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి సంవత్సరానికి రూ.120 చెల్లిస్తే ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సకు అర్హులని తెలిపింది. పెన్షన్‌ ప్రయోజనాలు పొందేందుకు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌, ఉద్యోగి మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల గుర్తింపు పత్రాలతో ఇఎస్‌ఐసి బ్రాంచ్‌ ఆఫీసులో సమర్పించవచ్చని పేర్కొంది.