Nov 22,2020 06:30

అక్టోబరు నెలలో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులు విడుదల చేసిన నివేదికలు కోవిడ్‌ను అరికట్టడం, ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. హఠాత్తుగా దేశం మొత్తం లాక్‌డౌన్‌ విధించడం, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం ప్రజల జీవితాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపాయని ప్రపంచబ్యాంకు నివేదిక పేర్కొన్నది. మార్చి చివరిలో విద్యుత్‌ వినియోగం సాధారణం కన్నా 30 శాతం తగ్గిపోయి, ఆగస్టు చివరి వరకు అలాగే కొనసాగడం లాక్‌డౌన్‌ యొక్క తీవ్ర ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నది. తలసరి కోవిడ్‌ విస్తరణ ఎక్కువ జిల్లాలలో అత్యధికంగా ఉన్నది. మూడో వంతు జిల్లాలలో కార్యకలాపాలు 20 నుండి 30 శాతం వరకు తగ్గిపోయాయి. 50 శాతం జిల్లాలలో 30 నుండి 35 శాతం వరకు పడిపోయాయి. మిగతా 15 శాతం జిల్లాలలో అది మరింత ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికలో ప్రపంచం లోని 60 దేశాలలో ఆర్థిక క్షీణత 11.6 శాతం ఉండగా, భారత్‌లో 23.9 శాతంగా ఉంది. 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ 9.6 శాతం క్షీణిస్తుందని నివేదికలో పేర్కొన్నారు.

అతి తీవ్రమైన ఆంక్షలతో లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కోవిడ్‌ 19 వ్యాప్తిని అరికట్టడంలో భారత్‌ విఫలమైందని ప్రపంచబ్యాంకు నివేదిక పేర్కొంది. సెప్టెంబరు చివరి నాటికి దక్షిణాసియాలో అత్యధిక కేసులు నమోదైన దేశాలలో రెండవ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌ కన్నా భారత్‌లో కోవిడ్‌ కేసులు 17 రెట్లు అధికంగా నమోదైనాయి. దేశంలో 10 లక్షల మందికి 4,574 కేసుల చొప్పున నమోదైనాయి. ఈ సంఖ్య బంగ్లాదేశ్‌లో 2207 మాత్రమే. నేపాల్‌లో 2,670, పాకిస్తాన్‌లో 1416 చొప్పున నమోదైనాయి. ఒక్క మాల్దీవులు మాత్రమే 19,038 కేసులతో భారత్‌ కన్నా అగ్ర స్థానంలో ఉన్నది. కోవిడ్‌ రోగులలో చనిపోయిన వారి శాతం ఆఫ్ఘనిస్తాన్‌లో 3.7 శాతం, పాకిస్తాన్‌లో 2.1 శాతం, భారత్‌లో 1.6 శాతం, బంగ్లాదేశ్‌ 1.4 శాతం, అత్యధిక శాతం కేసులు నమోదైన మాల్దీవులలో 0.3 శాతంగా ఉన్నాయి.
తక్కువ ఆదాయం పొందే గ్రూపులకు ఉపాధి కల్పించే అసంఘటిత రంగంపై కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోవడంతో మొదటి ఆరు నెలలలో స్వయం ఉపాధి పనులు 12 శాతం పెరిగాయి. సంఘటిత, అసంఘటిత రంగాలలోని ఉద్యోగాలు 30, 8 శాతం చొప్పున తగ్గిపోయాయి. దానితో కార్మికులు తక్కువ వేతనాలు పొందే పనుల వైపు మళ్ళారు. 74 శాతం అసంఘటిత రంగ కార్మికులున్న పట్టణాలలో 83 శాతం మంది కొత్తగా నిరుద్యోగులైనారు. మరోవైపున ఆహార సరుకుల ధరలు పెరగటం పేదలకు పెనుభారంగా మారింది. అత్యంత వినాశకరమైన ప్రభావం విద్యార్థులపై పడింది. దక్షిణాసియా లోని 39.1 కోట్ల మంది ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యార్థులు 0.5 సంవత్సరాల విద్యను కోల్పోయారని పేర్కొంది. దీని వలన జీవిత కాలంలో దక్షిణాసియాలో 60,000 కోట్ల డాలర్ల నష్టం జరుగుతుండగా, దానిలో భారత్‌ 40,000 కోట్ల డాలర్లు నష్టపోనున్నది.

ఐఎంఎఫ్‌ నివేదిక
వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ పేరుతో ప్రపంచబ్యాంక్‌ రూపొందించిన నివేదిక కూడా ఇదేవిధమైన అంశాలను పేర్కొన్నది. వినియోగం తగ్గటం, పెట్టుబడులు పెట్టటం ఆగిపోవటంతో భారత జిడిపి పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పింది. వినియోగ సరుకుల సరఫరాలు తగ్గిపోవటం ద్రవ్యోల్బణం పెరగటానికి దారితీసింది. 2020లో వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న, దేశాల జిడిపి 3.3 శాతం, అభివృద్ధి చెందిన దేశాల జిడిపి 5.8 శాతం పడిపోనుండగా భారత జిడిపి 10.3 శాతం పడిపోతుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ పరిణామాల వలన మొత్తంగా ప్రపంచ జిడిపి 4.4 శాతం పడిపోతుందని పేర్కొంది. ఆసియా లోని వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో జిడిపి 1.7 శాతం పడిపోతుంది. ఈ దేశాల కన్నా భారత్‌ జిడిపి అత్యధికంగా పడిపోతుందని నివేదిక తేటతెల్లం చేసింది. కొనుగోలు శక్తి ఆధారంగా 2019లో రూపొందించిన ప్రపంచ జిడిపి సూచికలో కూడా భారత్‌ 7.8 నుండి 7.1 శాతానికి దిగజారింది. అన్నింటి కన్నా తీవ్రమైన విషమేమంటే తలసరి జిడిపిలో మనం బంగ్లాదేశ్‌ కన్నా వెనుకబడిపోవటం. భారత్‌ కోవిడ్‌ను ఎదుర్కొన్న తీరు, మౌలిక వైద్య సదుపాయాలను పెంచటంలో విఫలం కావటం ఆర్థిక వ్యవస్థకు వినాశకరంగా పరిణమించాయి.
 

వైఫల్యాలను ఒప్పుకోని బిజెపి ప్రభుత్వం
సరళీకరణ విధానాలను రూపొందించే, ప్రోత్సహించే రెండు అంతర్జాతీయ సంస్థలు చేసిన ఈ విశ్లేషణ బిజెపి పాలనలో దేశం ఎదుర్కొంటున్న దుస్థితిని వెల్లడిస్తున్నది. 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంపొందిస్తామని, ప్రపంచ సూపర్‌ పవర్‌గా అభివృద్ధి అవుతామని చెబుతున్న మాటలు ప్రజలను మభ్యపెట్టటానికేనని, మనం అట్టడుగు స్థాయికి చేరుతున్నది వాస్తవమని పై విషయాలు వెల్లడిస్తున్నాయి. మనకన్నా చిన్న దేశాలు, మనలను మించి అభివృద్ధి సాధిస్తుండగా మనం వెనుకబడిపోవటానికి బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే కారణం. ఈ విధానాలను తిప్పికొట్టకుండా మన ప్రజలకు ఉపాధి కల్పించటం, ఉద్యోగాలివ్వటం, ఆర్థికాభివృద్ధిని సాధించటం సాధ్యం కాదు.
                                                                                                                       * ఎ. కోటిరెడ్డి