Nov 21,2020 06:35

స్నానం కూడ కరువే
ఈ మలిన దేహాలకు.
దాహానికి మినరల్‌, జనరల్‌ కాదు
దారిపక్క లీకైన నాలనే దిక్కు
అక్కడక్కడ
పాడుబడ్డ బావి, సర్కారు బోరింగు
దాహన్ని నింపే జలనిధులు
సబ్బు,షాంపూలు
మాసిన తలలకు
కొబ్బరినూనె, క్షవరాలు
సెంటు, అత్తరుల అంగళ్లు తెల్వదు
రోగమొస్తే రెస్టు తప్ప
దవాఖాన దవా(మందు) ఏసుకునుడు తెల్వదు
ఉతకని బట్టలు
ఊడుతున్న పేలికలు
ఆడాడా తనువంతా గాయాలు
ఉచ్చరోతలోనే గుడారాలు
గట్టుసప్పుడు కాని కాపురాలు
రోడ్డు పక్కన పడకలు
పందుల్తో, దోమల్తో దోస్తాన్లు
కప్పుకునే దుప్పట్లు అవో పెద్ద జల్లెడలు
మట్టిని అద్దుకున్న బట్టలు
చెప్పులు లేని కాళ్ళు
చెవికి గమ్మత్తైన రింగులు
సేతికి పాముల ప్రతిమల మచ్చలు
సంకన చిన్న సంచి
అదో ఖనిజాల కార్ఖాన.
చెవి కమ్మ నుంచి చేతి కడియం దాకా
సమస్తం అందులోనే....
అలసిన తనువులు
అంతులేని ఆకలి ఆరాటం
ఊరూరూ బతుకుకై చేసేము సర్కస్‌
రాలెను కాసిన్ని రాళ్ళు (డబ్బులు)
ఇదే నిత్య కృత్యం
పిట్టలు, కాకులు, కోతులు
మా బంధువులు
కోతి మాకు కడుపు నింపే కొడుకే
దాని ప్రతిమ మా ఇలవేల్పు
దాని చేష్టలు మా బతుకుకు
నాలుగు మెతుకులు రాల్చే ఆధారం
మా పేగుల అరుపులు
నిశబ్ద రాగాలుగా మారినపుడు
రబ్బర్లను సాగదీయడం
కాసిన్ని తోల్లు, మరిన్ని కట్టు రబ్బర్లు
దారు శిల్పం నైపుణ్యం
కలగలిసి అదో ఆయుధం
ఆధునిక పిస్టల్కు (తుపాకీ)
ఏ మాత్రం తీసిపోదు..అదే
''ఉండేలా'' పంగాల, గులేరు..
మాకున్న ఆయుధం..
మాకో భాష
మాకో ఆచారం.
ఎవరికి చిక్కని చిత్రాలు మా బతుకులు
చీదరించుకున్న వారు ఎక్కువ
ఆదుకున్నవారు బహు తక్కువ....!
                                            * నాగరాజు మద్దెల, సెల్‌ : 63019 93211