Oct 10,2021 13:06

అది ఆదిలాబాద్‌ అడవి. ఆ అడవి ఒకప్పుడు దట్టంగా పెద్దపెద్ద చెట్లతో అనేకరకాల జంతువులతో విలసిల్లుతూ ఉండేది. ఆ అడవికి రాజుగా విక్రముడనే సింహం ఉండేది. అది అందరినీ చక్కగా చూస్తూ మంచి పాలకుడన్న పేరు తెచ్చుకుంది. ఆ సింహానికి దురాత్మ అనే కొడుకు ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే యువరాజుననే గర్వంతో అడవిలోని జంతువుల పట్ల చిన్నచూపు ప్రదర్శించేది.
అదే అడవిలో సుమతి అనే కోతి ఉండేది. ఓసారి దారితప్పి ఆ అడవికి పక్కనే ఉన్న ఊర్లోకి వెళ్లింది. అక్కడ చిన్న పిల్లలు దానిని రాళ్లతో కొడతారు. దీంతో సుమతి భయపడి చంద్రయ్య ఇంట్లోకి దూరుతుంది. ఆయుర్వేద వైద్యుడైన అతను సుమతిని చేరదీసి గాయాలకు మందు పూస్తాడు. కొద్దిరోజులు అక్కడే ఉన్న సుమతి ఆయుర్వేద వైద్యంలో మెళకువలు నేర్చుకుంటుంది. చెట్ల ఆకుల పసర్లను ఎలా వినియోగించాలో తెలుసుకున్న తర్వాత అడవికి వెళ్లి వైద్యం చేస్తుంది.
చంద్రయ్య లాగే సుమతి కూడా ఒక నియమం పెట్టుకుంది. వైద్యం అవసరమైనవాళ్లు తన వద్దకు వస్తేనే వైద్యం చేసేది. లేవలేని వారైతేనే తాను వెళ్లేది. ఈ పద్ధతి ప్రకారమే ఆ అడవిలోని జంతువులకు వైద్యం చేస్తుండేది.
ఇదిలా ఉండగా ఒకరోజు యువరాజు దురాత్మ కాలిలో ముల్లు గుచ్చుకుంటుంది. సుమతిని వచ్చి వైద్యం చేయమని నక్కతో చెప్పి పంపుతాడు. నక్క 'సుమతీ! యువరాజు కాలిలో ముల్లు గుచ్చుకుంది. తీయడానికి రమ్మంటున్నాడు' అని చెబుతుంది. 'నక్కబావా! నా పద్ధతి తెలుసుగా, మరీ లేవలేని వారైతేనే వారివద్దకు వెళ్తాను. కాలిముల్లే కదా! యువరాజును ఇటే రమ్మను' అని చెబుతుంది. ఈ విషయాన్ని దురాత్మకు చెప్పగా 'ఆ కోతికి అంత తలబిరుసా! అయినా తప్పదుకదా' అనుకుంటూ వెళ్లి కాలిలో గుచ్చుకున్న ముల్లును తీయించుకుంటుంది. కానీ దురాత్మ మనసులో సుమతిపై కోపం అలాగే ఉంది.
విక్రముడు ముసలివాడవ్వడంతో రాజుగా దురాత్మ పగ్గాలు చేపడతాడు. ఏదో ఒక నెపంతో సుమతిని అడవినుంచి బహిష్కరించి తన కోపం తీర్చుకుంటుంది. అడవిలో జంతువులన్నీ సుమతిని బహిష్కరించినందుకు చాలా బాధపడతాయి. సుమతి పక్కనే ఉన్న సిరివంచ అడవిలోకి వెళ్తుంది. తన వైద్యంతో అక్కడి జంతువులకు సేవచేస్తూ కొద్దిరోజుల్లోనే ఆ అడవికి రాజవైద్యునిగా నియమించబడుతుంది. అయితే ఆదిలాబాద్‌ అడవిలోని జంతువులకు సరైన వైద్యం అందక అనారోగ్యానికి గురవుతాయి. సుమతి సిరివంచ అడవిలో ఉందని తెలిసి చాటుగా అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకుంటాయి.
అలా కొద్దికాలం గడుస్తుంది. విక్రమునికి వింతవ్యాధి సోకి, లేవలేని స్థితిలో కష్టపడుతుంటాడు. దురాత్మకు ఇది పెద్ద తలనొప్పిగా మారి, విక్రమున్ని బాధ నుంచి తప్పించే వైద్యుడు అడవిలో లేడని గ్రహించి చింతిస్తాడు. ఆ సమయంలో నక్క 'రాజా! మన అడవిలోంచి మీరు బహిష్కరించిన సుమతి పక్కనే సిరివంచ అడవిలో రాజవైద్యునిగా ఉన్నట్లు తెలిసింది. సుమతిని ఇక్కడికి రప్పిస్తే, మీ తండ్రిగారి జబ్బు నయమై ఆరోగ్యం కుదుటపడుతుంది' అని సలహా ఇస్తుంది. 'మనం సుమతిని బహిష్కరించాం కదా! అది వస్తుందంటావా' అని అనుమానం వెలిబుచ్చుతాడు దురాత్మ. 'నేను వెళ్లొస్తా! చూద్దాం' అంటూ నక్క సిరివంచ అడవికి వెళ్లి సుమతితో విషయం చెప్పి, అక్కడి రాజు అనుమతితో ఆదిలాబాద్‌ అడవికి తీసుకొస్తుంది నక్క. విక్రముని పరీక్షించిన సుమతి 15 రోజులు అక్కడే ఉండి పసరు వైద్యంతో జబ్బునయం చేస్తుంది.
తన తప్పును గ్రహించిన దురాత్మ 'నీ మీద కోపంతో అన్యాయంగా అడవి నుంచి బహిష్కరించా, అయినా మా తండ్రిని రక్షించావు. నీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు. ఇక్కడే రాజవైద్యునిగా ఉండు' అని కోరతాడు. దానికి సుమతి 'రాజా! ఆపదలో ఉన్నవారిని కాపాడటం నా ధర్మం, కాబట్టి వచ్చి మీ తండ్రికి వైద్యం అందించాను. కానీ నా వ్యక్తిత్వాన్ని చంపుకుని ఇక్కడ ఉండలేను. నేను వైద్యం నేర్పిన శిష్యులు ఇద్దరున్నారు. వారిని పంపిస్తాను. వారినైనా జాగ్రత్తగా గౌరవంగా చూసుకోండి. అవసరమైనప్పుడు తప్పక నా సేవలందిస్తాను' అంటూ సిరివంచ అడవిదారి పడుతుంది సుమతి. తన అజ్ఞానానికి, తొందరపాటుకు, గర్వానికి ఒక మంచి వైద్యుని సేవలను నిరంతరం పొందలేక పోతున్నందుకు బాధతో తలవంచుకుంటుంది దురాత్మ.
 

గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ
94900 03295