Mar 01,2021 20:55

నెపిడా : ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు అనంతరం మొదటిసారిగా ఆంగ్‌ సాన్‌ సూకీ కోర్టు విచారణకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం జరిగిన విచారణ సమయంలో మొదటిసారిగా ఆమె తరపు లాయర్లు చూశారు. సూకీ ఆరోగ్యంగానే కనిపించారని ఆమె తరపు న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు. కుట్ర అనంతరం ఆమెపై మోపిన అభియోగాలకు ఈనాటి విచారణలో మరో రెండింటిని అదనంగా జోడించారని చెప్పారు. అక్రమంగా ఆరు వాకీ టాకీ రేడియోలను దిగుమతి చేసుకున్నారని తొలుత ఆమెపై అభియోగాలు మోపారు. ఆ తర్వాత, కరోనా వైరస్‌ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించి ప్రకృతి విపత్తు చట్టాన్ని అతిక్రమించారని మరో అభియోగం మోపారు. సోమవారం మరో రెండు అభియోగాలను చేర్చారు. మార్చి 15న తదుపరి విచారణ జరగనుంది.

కాగా, యాంగాన్‌ నగరంలో నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు గ్రెనెడ్లను, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్లు వార్తలందలేదు కానీ ఆదివారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 18మంది మరణించారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. సైనిక అణచివేత చర్యలను కూడా ధిక్కరించి పలు పట్టణాలు, నగరాల్లో మద్దతుదారులు సోమవారం కూడా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నెల రోజుల కాలంలో ఆదివారం అత్యంత ఎక్కువగా రక్తపాతం చిందింది. తాము ఆందోళనలను ఆపేది లేదని ప్రదర్శకులు స్పష్టం చేస్తున్నారు. మయన్మార్‌పై మంగళవారం ప్రత్యేకంగా ఆసియాన్‌ సమావేశం ఏర్పాటు చేసినట్లు సింగపూర్‌ విదేశాంగ మంత్రి తెలిపారు.