Nov 30,2020 23:22

తెనాలి మండలంలో నీటమునిగిన వరి పైరును కాపాడుకునే ప్రయత్నంలో రైతు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో నివర్‌ తుపాను తాకిడికి గురైన పంటల నష్టం పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 42 మండలాల పరిధిలో 478 గ్రామాల్లో 3.33 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 30 మండలాల్లో 71 గ్రామాల్లో 11,800 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల రూపొందించిన ప్రాథమిక నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఇందులో 3 లక్షల 29 వేల ఎకరాల్లో వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. మినుము 2100 ఎకరాలు, పెసర 220 ఎకరాలు, వేరుశనగ 350 ఎకరాలు, పత్తి 700 ఎకరాలు, మొక్కజొన్న 460 ఎకరాలు, శనగ 470 ఎకరాలు, మిర్చి 10 వేల ఎకరాలు, 550 ఎకరాల్లో కూరగాయలు, వెయ్యి ఎకరాల్లో అరటి, 175 ఎకరాల్లో పసుపు పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాల ప్రకారం తేలింది. తమలపాకు, బొప్పాయి, ఇతర పంటలకు కూడా మొత్తంగా 60 ఎకరాల్లో నష్టం జరిగింది.
కోతకు సిద్ధంగా ఉన్న, కోసిన వరి పంట నీట మునగడం, నేల వాలడంతో వరి రైతులు ఎక్కువగా నష్టపోయారు. ఇందువల్ల ధాన్యం దిగుబడి కూడా తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో భారీగా తడిసిన, రంగు మారిన ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 164 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో కల్లాల్లో తడిసిన వరి ఓదెలను ఎండబెట్టుకుని రైతులు నూర్పిడికి సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం అత్యవసరంగా నూర్పిడికి యంత్రాలను వినియోగిస్తున్నారు. మరోవైపు బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్న సమాచారం రైతులను కలవరపరుస్తోంది.
ఈనెల 5న కూడా మరో అల్పపీడనం ఏర్పడుతుందన్న వార్తలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరస తుపానుల ప్రభావం జిల్లాలో అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు అన్నదాతల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు వరి పైరును కోయని వారు మరో పక్షం రోజులు ఆగాలన్న నిర్ణయానికి వస్తున్నారు. కోసిన తర్వాత ఆరడానికి కనీసం వారం పడుతుందని, ఈలోగా వర్షాలొస్తే తీరని నష్టమని చెబుతున్నారు.
జిల్లాలో మిర్చి రైతులకూ బాగా నష్టం వాటిల్లింది. అయితే అధికారులు నీట మునిగిన ప్రాంతాలనే పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే భారీ వర్షాలకు పూత రాలిపోయిందని రైతులు వాపోతున్నారు. దీని వల్ల మిర్చి మొదటి విడత కాయల ఉత్పత్తికి గండిపడినట్టు చెబుతున్నారు. పత్తి రైతుల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా మారింది. గత సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో అధిక వర్షాల వల్ల పత్తి రైతులు దెబ్బతిన్నారు. మొదటి తీత పత్తి తీసే అవకాశం లేకుండా పోయింది. రెండోసారి పూత, పిందే ఏర్పడేలోగానే మళ్లీ నివర్‌ తుపాను తాకిడికి పత్తికి బాగా నష్టం జరిగింది. అధికారులు మునిగిన పొలాలనే పరిగణలోకి తీసుకుంటున్నారు. పత్తి పువ్వులు, కాయలు దెబ్బతిన పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మొదటి విడత పత్తి ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల వరకు రావాల్సి ఉండగా దాదాపు రెండు లక్షల ఎకరాల్లో అధిక వర్షాలకు రైతులు నష్టపోయారు. ఇప్పుడు రెండోసారి వచ్చిన పూత, కాయలు దెబ్బతినడంతో రైతులు ఘొల్లుమంటున్నారు.
పత్తిని ఎండబెట్టుకుని తీసుకురావాలి : జెసి
నివర్‌ తుపాను తాకిడికి పత్తి పైరు కూడా కొంత దెబ్బతిందని అధికారులు అంచనా వేశారు. తడిసిన, దెబ్బతిన్న పత్తిని ఆరబెట్టుకుని నాణ్యత దెబ్బతినకుండా సిసిఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ కోరారు. తద్వారా కనీస మద్దతు ధర పొందాలని ఆయన కోరారు. జిల్లాలోని 42 జిన్నింగ్‌ మిల్లులతో పాటు తాడికొండ, సత్తెనపల్లి, నర్సరావుపేట, క్రోసూరు మార్కెట్‌ యార్డుల్లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన కోరారు.