Mar 02,2021 22:15

కోలగట్ల గ్రూపునకే బి-ఫారాలు

విజయనగరం టౌన్‌: అధికార పార్టీలో బి-ఫారాల రాజకీయం కొలిక్కివచ్చింది. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి బొత్స గ్రూపు అభ్యర్థులకు, ఎమ్మెల్యే కోలగట్ల గ్రూపు అభ్యర్థులకు మధ్య బి-ఫారాల గొడవకు అధిష్టానం చర్చపోచర్చల అనంరం తెరదించింది. చివరికి ఎమ్మెల్యే కోలగట్ల పంతం నెగ్గించుకొని తన అనుయాయులకే బి-ఫారాలు దక్కేలా అధిష్టానాన్ని ఒప్పించారు.
గత వారం రోజులుగా విజయనగరం కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసిపి కార్పొరేటర్‌ అభ్యర్థుల బి-ఫారాల సమస్యకు అధికార పార్టీ నాయకులు చెక్‌ పెట్టారు. బొత్స గ్రూపునకు చెందిన అవనాపు సోదరులతో పాటు మరి కొంతమంది అభ్యర్థులు 19 మంది వరకు రెబల్‌గా నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. గత ఏడాది మార్చి 16తో నామినేషన్లు ఉపసంహరణ ముగియనున్న సమయంలో కరోనా కారణంగా ఎన్నికలు వాయిదాపడ్డాయి. అప్పటికేబి-ఫారాల కోసం ఎదురు చూసిన రెబల్‌ అభ్యర్థులు ఎన్నికల వాయిదా పడటంతో మిన్నకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో రెబల్‌ అభ్యర్థులంతా తమకే టిక్కెట్లు ఖరారు చేయాలని ముఖ్యమంత్రిని, పలువురు మంత్రులను కోరారు. గత నాలుగు రోజులుగా రెబల్‌ అభ్యర్థుల్లో కొంతమందికి బి-ఫారాలు వస్తాయని పార్టీలో చర్చ జరిగింది. పలు దఫాలుగా ఎమ్‌పి విజయసాయిరెడ్డి వద్ద జరిగిన పంచాయితీ సోమవారం రాత్రి ఒక కొలిక్కివచ్చింది. అవనాపు కుటుంబానికి రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పోస్టు ఇస్తామని ముఖ్యమంత్రి మాటగా చెప్పి అవనావు కుటుంబాన్ని ఎన్నికల నుంచి విత్‌ డ్రా కావాలని ఒప్పించారు. దీనికి అవనావు కుటుంబ సభ్యులు కూడా అంగీకరీంచారు. ఎమ్మెల్యే కోలగట్ల కూడా ఇందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. దీంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి అవనాపు కుటుంబం నుంచి వేసిన రెండు నామినేషన్లనూ ఉపసంహరించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే క్రమంలో రెబల్‌ అభ్యర్థుల్లో 12 మందిని నామినేషన్లు ఊపసంహరించుకునేలా చూడాలని నాయకత్వం అవనాపు కుటుంబానికి సూచించింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని చెప్పడంతో రెబల్‌ అభ్యర్థులను మంగళవారం ఇంటికి పిలిపించి మాట్లాడే పని ప్రారంభించారు. అయితే ఆ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నామినేషన్లను ఉపసంహరించు కునేందుకు సిద్ధంగా లేమని చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం3 గంటల వరకు ఉపసంహరణకు సమయం ఉండటంతో రెబల్‌ అభ్యర్థులను ఒప్పించే పనిలో ఉన్నారు. ఎంతమంది ఉపసంహరించుకుంటారో, పోటీలో ఎంతమంది బరిలో ఉంటారో బుధవారం మధ్యాహ్నం 3గంటలకల్లా తేలిపోనుంది. ఏదేమైనా బి- ఫారాలు తన అనుచరులకు ఇప్పించే విషయంలో ఎమ్మెల్యే కోలగట్లదే పై చేయిగా నిలిచింది.