Feb 13,2021 01:01

టి.నగరపాలెం సర్పంచి అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్న వైసిపి మద్దతు అభ్యర్థి గౌతమి

విశాఖ డివిజన్‌ పరిధిలో చివరిరోజైన శుక్రవారం నామినేషన్లు ఊపందుకున్నాయి. భారీ ర్యాలీలతో అభ్యర్థులు తరలివచ్చి నామినేషన్లు వేశారు. అన్ని కేంద్రాల్లో అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.
భీమునిపట్నం : మండలంలో 15 గ్రామ పంచాయతీల్లో 15 సర్పంచి, 156 వార్డు స్థానాలకు ఈ నెల 21న జరగనున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది. చివరిరోజు నామినేషన్‌ కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం కనిపించింది. తాటితూరు, చిప్పాడ నామినేషన్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ల వద్ద అభ్యర్థులు, వారి అనుచరులు గుమిగూడి కనిపించారు.
నామినేషన్ల గడువు ముగిసేసరికి సర్పంచి స్థానాలకు 73, వార్డు స్థానాలకు 447 నామినేషన్లు దాఖలయ్యాయి. అమనాం పంచాయతీలో 5, అన్నవరంలో 4, బోడ మెట్టపాలెంలో 4, చిప్పాడలో 9, దాకమర్రిలో 8, లక్ష్మీపురంలో 7, మజ్జి పేటలో 2, మజ్జివలసలో 4, మూలకుద్ధులో 3, టి.నగర పాలెంలో 5, నారాయణ రాజు పేటలో 4, పెదనాగమయ్య పాలెంలో 4, సింగనబందలో 5, తాళ్లవలసలో 3, తాటితూరు పంచాయతీలో 6 నామినేషన్లు దాఖలయ్యాయి.
సబ్బవరం : మండల సహాయ ఎన్నికల నిర్వహణ అధికారి బి.రమేష్‌ నాయుడు నామినేషన్ల వివరాలు వెల్లడించారు. సర్పంచి స్థానాలకు 140, వార్డు మెంబర్ల స్థానాలకు 724 మంది నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని తవ్వవాని పాలెం, నల్లరేగులపాలెం పంచాయతీల సర్పంచి పదవికి ఒక్కొక్క నామినేషనే పడటంతో అవి ఏకగ్రీవం కానున్నాయి. టిడిపి బలపరిచిన మొగలిపురం సర్పంచి అభ్యర్థి గండి అరుణకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ర్యాలీలో పాల్గొన్నారు.
ఆరుగురు స్వతంత్ర వార్డు సభ్యులకు సిపిఎం మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ నాయకులు గండి నాయనబాబు తెలిపారు. వంగలిలో అల్లం దేముళ్లు, ఎర్రా సోమేశ్‌, గొర్లె అప్పలనాయుడు, గాలిభీమవరంలో చిట్టిబోయిన సత్యనారాయణ, గొల్లలపాలెంలో ఉప్పిలి అప్పారావు, ఉప్పిలి సోమేశ్వరరావు తమ పార్టీ మద్దతు అభ్యర్థులుగా బరిలో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఉప్పాడ సత్యవతి, ఎర్రా సోంబాబు తదితరులు పాల్గొన్నారు
ఆనందపురం : మండలంలో 26 పంచాయతీలున్నాయి. వైసిపి మద్దతుదారులమంటూ పలువురు నామినేషన్లు వేశారు. రెబల్స్‌ బెడద ఎక్కువుగా ఉంది. తర్లువాడ, పందలపాక, పెద్దిపాలెం పంచాయతీల్లో సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశముంది. పందలపాక పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా దవళ నాగేశ్వరరావు, బోని పంచాయతీ నుంచి వైసిపి మద్దతుతో సీనియర్‌ నాయకులు బోని అప్పలనాయుడు బలపరిచిన అభ్యర్థిగా బోని అప్పలకొండ, పాలవలస పంచాయితీలో నాగోతి అచ్చియ్యమ్మ భారీ ర్యాలీలతో తరలివెళ్లి నామినేషన్లు వేశారు.
పద్మనాభం : నామినేషన్లు వేసేందుకు అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మద్ది గ్రామంపైనే అందరి చూపూ నిలిచింది. ఈ గ్రామం నుంచి వైసిపి మండల అధ్యక్షులు కె.రాంబాబు, టిడిపి మండల అధ్యక్షులు కె.నగేష్‌ కుమార్‌లు ప్రధాన నాయకులుగా ఉన్నారు. వారి మద్దతుదారులు ఇకే రోజు నామినేషన్‌ వేయడానికి పూనుకోవడంతో పోటాపోటీగా బలప్రదర్శనలకు దిగారు. పద్మనాభం, రెడ్డిపల్లి, అనంతవరం, రేవిడి, బిఆర్‌.తాళ్లవలసల్లో సందడి వాతావరణం కనిపించింది. చిన్నాపురం, విలాస్‌ఖాన్‌పాలెం, కోరాడ, రేవిడి గ్రామాల్లో సర్పంచి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యే అవకాశముంది. అధికార పార్టీ నుంచి మండలంలో రెబల్స్‌ బెడద ఎక్కువుగా ఉంది. మొత్తంగా 22 పంచాయతీలకుగాను సర్పంచి స్థానాలకు 131, వార్డు మెంబర్ల స్థానాలకు 764 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.