
అహ్మదాబాద్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ఈ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉన్న కోహ్లీ.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. కోహ్లీ మరొక సెంచరీ పూర్తి చేస్తే.. అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకెళ్తాడు. టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య స్వదేశంలో టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రెండు మ్యాచ్‌లు జరిగాయి. అందులో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు అహ్మదాబాద్‌లోని మోటెరా స్టేడియం వేదికగా జరిగే మూడో టెస్టు మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని ఇరు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి.
అయితే, మూడో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ప్రపంచ రికార్డును అందుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కెప్టెన్లుగా అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (41) పేరు మీద ఉంది. 41 సెంచరీలతోనే రికీ పాంటింగ్‌కు సమానంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే.. 42 సెంచరీలతో పాంటింగ్‌ను వెనక్కి నెట్టి కోహ్లీ తొలిస్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది. ఇక, టెస్టుల్లో కోహ్లీ 27 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టు విజయం.. కెప్టెన్‌గా స్వదేశంలో కోహ్లీకి 21వ విజయం. అంతేకాకుండా మోటెరాలో మ్యాచ్ గెలిస్టే.. స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ (21) రికార్డును బద్దలు కొట్టనున్నాడు. స్వదేశంలో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లీ ధోనీని అధింగమించనున్నాడు. వీరిద్దరి తరువాతి స్థానంలో మహ్మద్ అజారుద్దీన్ (13), సౌరబ్ గంగూలీ (10), సునీల్ గవాస్కర్ (7) ఉన్నారు. ఇదిలా ఉండగా, 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లీ.. అప్పటి నుంచి 10 మ్యాచ్‌లు ఆడినా ఒక్క సెంచరీ కూడా చేయలేదు.