
సిడ్నీ : కరోనా అనంతరం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు తమ తొలి పోరుకు సిద్ధమైంది. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో తొలి వన్డే శుక్రవారం ఉదయం 9.15 గంటలకు ఆడనుంది. సిడ్నీ మైదానం వేదికగా 50 శాతం ప్రేక్షకుల సమక్షంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి క్వారంటైన్ పూర్తి చేసుకున్న భారత జట్టు అన్ని విధాలా సిద్ధమైంది. ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి బలగంతో బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 2018-19 పర్యటనలో 2-1తో వన్డే సిరీస్ గెలుచుకున్న భారత్ అదే జోరు కనబర్చి విజయంతో టూర్ ప్రారంభించాలని భావిస్తోంది. మరోవైపు గత సీజన్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది.
ఓపెనర్‌గా మయాంక్.. ఐదో స్థానంలో కెఎల్ రాహుల్..
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమవడంతో శిఖర్ ధావన్‌కు జతగా మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. వికెట్ కీపింగ్ చేయనున్న కెఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మూడు, నాలుగు స్థానాల్లో బరిలోకి దిగుతారు. గాయంతో చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎలా ఆడుతాడనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే అతను ఐపిఎల్‌లో బౌలింగ్ చేయలేదు. కానీ బ్యాటింగ్‌లో చెలరేగాడు. పైగా భారత్‌కు బౌలింగ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక రొటేషన్ పద్దతిలో బుమ్రా, షమీ వర్క్‌లోడ్‌ను తగ్గిస్తామన్న బిసిసిఐ ఫస్ట్ మ్యాచ్‌కు ఈ సాహసం చేయకపోవచ్చు. ఈ స్టార్ పేసర్లు ఇద్దరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే నవ్‌దీప్ సైనీ, శార్దుల్ ఠాకుర్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. లోయారార్డర్ బ్యాటింగ్ బలంగా ఉండాలనుకుంటే ఠాకుర్‌ను తీసుకోవచ్చు.
స్మిత్, వార్నర్ రెడీ..
గత ఆసీస్ పర్యటనకు ఈ సారి సమరానికి ప్రధాన తేడా స్మిత్, వార్నరే. ఏడాది నిషేధం కారణంగా గత పర్యటనకు అందుబాటులో లేని ఈ ఇద్దరూ ఈ సారి సొంతగడ్డపై సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. వార్నర్, ఫించ్ ఓపెనింగ్ జోడీ శుభారంభం అందిస్తే.. మూడోస్థానంలో స్మిత్ దానిని కొనసాగించగలడు. 2019లో టెస్ట్ క్రికెట్లో పలు ఘనతలు అందుకున్న లబుషేన్ నాలుగో స్థానంలో కీలకం కానున్నాడు. ఇక ఐపీఎల్లో సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చిన మార్కస్ స్టోయినిస్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఐదు, ఆరో స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్ దారుణంగా విఫలమైన మ్యాక్స్ వెల్ ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజల్వుడ్లతో బౌలింగ్ లైనప్ కూడా పటిష్టంగానే ఉంది.