
న్యూఢిల్లీ : సిఆర్పిఎఫ్ ప్రత్యేక జంగిల్ వార్ఫేర్(అటవీ యుద్ధ దళం) 'కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్(కోబ్రా)'లో మహిళలను కూడా ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సిఆర్పిఎఫ్ చీఫ్ ఎపి.మహేశ్వరి తెలిపారు. గురువారం నాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ' కోబ్రా దళంలో మహిళలను తీసుకోవడాన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నాం'అని చెప్పారు. ఇంటెలిజెన్స్ ఆధారిత జంగిల్ వార్ఫేర్ కార్యకలాపాల కోసం ఈ కోబ్రా ఫోర్స్‌ను సిఆర్పిఎఫ్ 2009లో ప్రారంభించింది. దేశంలో 10 కోబ్రా యూనిట్లలో 12 వేల మంది సైనికుల వరకు పనిచేస్తున్నారు. ఈ కోబ్రా దళాలను అధిక శాతం నక్సలైట్ల ప్రభావం ఉన్న రాష్ట్రాలతో పాటు దేశంలోని అక్రమ చొరబాట్లను తిప్పికొట్టేందుకు వినియోగిస్తారు. ఈ దళంలోని ప్రవేశించాలంటే ఆ వ్యక్తి మానసికంగా, శారీరకంగా చాలా బలంగా ఉండాలి. 1986 నుంచి సిఆర్‌పిఎఫ్‌లోకి మహిళలను తీసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ దళంలో ఆరు మహిళా బెటాలియన్లు ఉన్నాయి. 3.25 లక్షల మంది సైనికులతో సిఆర్పిఎఫ్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళంగా ఉంది.