Apr 15,2021 01:07

అనకాపల్లిలో తనిఖీలు చేస్తున్న సిఐడి అధికారులు

ప్రజాశక్తి-యంత్రాంగం
వైద్య పరికరాల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న అభియోగాలపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిఐడి తనిఖీలు కొనసాగుతున్నాయి. బుధవారం అనకాపల్లి, మాడుగుల, చోడవరం ప్రాంతాల్లోని సిహెచ్‌సి, ఏరియా ఆస్పత్రులు, పిహెచ్‌సిల్లో సోదాలు నిర్వహించి రికార్డులు తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లో పరికరాల మరమ్మతుల వివరాలను సిఐడి అధికారులు వైద్యులనడిగి తెలుసుకున్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని బుచ్చయ్యపేట, తురకలపూడి పిహెచ్‌సిలో బుధవారం సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంలో ఆసుపత్రికి కొనుగోలు చేసిన పరికరాలు, మరమ్మతులు చేసిన వాటి వివరాలు, ప్రస్తుతం వాటి స్థితి తదితర వివరాలను పరిశీలించారు. స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. వైద్య అధికారులతో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించారు.