Apr 14,2021 20:54

బెంగళూరు: కర్ణాటకలో ఆర్‌టిసి ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. వేతన సవరణ ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 7న ప్రారంభమైన సమ్మె బుధవారం కూడా కొనసాగింది. ఉద్యోగులు వివిధ రకాలుగా తమ సమ్మె కొనసాగిస్తున్నారు. మంగళవారం, బుధవారం వివిధ పట్ణణాల్లో ప్రధాన రహదారులు, కూడల్లో ఉద్యోగులు భిక్షాటన చేశారు. మరోవైపు సమ్మె అణిచివేయడానికి రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. ఉద్యోగులపై కేసులు నమోదు చేస్తోంది. ఉడిపి జిల్లాలోని బైందూర్‌ పట్ణణ పోలీసులు ఇద్దరు ఉద్యోగులపై ఐపిసిలోని సెక్షన్లు, ఎస్మా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అభియోగాలతో కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 72 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. 115 మంది ఉద్యోగులపై బస్సులు ధ్వంసం చేశారనే అభియోగాలను మోపారు. ఇప్పటి వరకూ 19 మందిని అరెస్టు చేశారు. ఈ సమ్మె కాలంలో రాష్ట్రంలో 60 బస్సులు ధ్వంసమయ్యాయని అధికారులు చెబుతున్నారు. తుమకుర్‌ వద్ద బస్సుపై రాళ్లదాడిపై డ్రైవర్‌, కండక్టర్‌ గాయపడ్డారని తెలిపారు. అలాగే కోలార్‌ వద్ద ఆర్‌టిసి బస్సులో నుంచి ఇంధనం దొంగలించారని అధికారులు ఫిర్యాదు చేశారు.