Nov 29,2020 23:12

gandi

ప్రజాశక్తి-టంగుటూరు: రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వగ్రామం టంగుటూరు మండలం, కొణిజేడులో నివర్‌ తుపాన్‌ ప్రభావంతో అర్ధరాత్రి ప్రమాదం సంభవించింది. అందరూ నిద్రలో ఉన్న సమయంలో గ్రామ చెరువుకు గండి పడింది. గ్రామంలోకి నీరు వస్తుండటంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు చెరువుకు గండి పడినట్లు గుర్తించి.. అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం వేకువజాము నుండే సమస్య పరిష్కారానికి అందరూ సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జలవనరుల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. పలు శాఖల అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. దాదాపు 300 ట్రక్కులకు పైగా మట్టిని గండి పడిన ప్రాంతంలో చెరువుకు మేరువ తోలారు. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సమస్య పరిష్కారమైంది. కొణిజేడు గ్రామ నాయకులు రామగోపి, ఈదా వెంకటరెడ్డి, బాలినేని వెంకటేశ్వరరెడ్డి, తాటిపర్తి వెంకటేశ్వరరెడ్డి తదితరులు రాజకీయాలకు అతీతంగా సాయంత్రం వరకు సంఘటనాస్థలం వద్దే ఉండి సమస్య పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.
కలెక్టర్‌ పరిశీలన
ఆదివారం గ్రామానికి చేరుకున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సమస్యను పరిశీలించి.. గ్రామస్తులతో చర్చించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమస్య పరిష్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఉన్న దాదాపు 27 ట్రాక్టర్లు, 3 జెసిబిలను మట్టి తోలేందుకు వెనువెంటనే ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు గ్రామం సమీపంలోని కొండ మట్టిని తొవ్వి 300 ట్రక్కులకు పైగా చెరువు గండి పూడ్చేందుకు గ్రావెల్‌తో మేరువను పటిష్టంగా ఏర్పాటు చేశారు.
తప్పిన ప్రమాదం
కొణిజేడు గ్రామ చెరువు 280 ఎకరాలలో విస్తరించి ఉంది. దాదాపు 500 ఎకరాలకుపైగా చెరువు నీటిపై ఆధారపడి ఆయకట్టు రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈ చెరువు మీదనే ఆధారపడి రైతులు వరి పండించుకుంటున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువుకు నిండా నీరు చేరింది. గ్రామానికి ఎగువ భాగంలో చెరువు ఉండటంతో గండి పడితే ఆ నీరంతా గ్రామంలోకి వచ్చే ప్రమాదం ఉంది. గ్రామస్తులు ప్రమాదాన్ని వెంటనే గుర్తించి సమాచారం అందించడం.. అధికారులు ఏకకాలంలో స్పందించి.. అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. కార్యక్రమంలో జలవనరుల శాఖ డిఇఇఇ ఎం.శివరామప్రసాద్‌, ఎఇఇఇ టి.త్రివిక్రమ్‌, తహశీల్దార్‌ వై.శివకుమార్‌, సిఐ యు.శ్రీనివాసులు, ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.