Oct 09,2020 22:21

వరి

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జిల్లాలో ఈ-క్రాప్‌ నమోదు ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చింది. పంటల నమోదు నేటి (శనివారం)తో ముగియనుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో పంటలు సాగు కాలేదు. ఈ-క్రాప్‌లో పంటలను నమోదు చేసుకున్న వారికే ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందని ప్రభుత్వం చెప్తోంది. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు పంటలు వేయలేదు. దీంతో వారి వివరాలు ఈ-క్రాప్‌లో నమోదయ్యే పరిస్థితి లేదు. దీంతో వారంతా పంటల బీమా, ఇతర ప్రయోజనాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. పంటలు వేయలేని రైతులకు నష్టపోయిన ఆదాయం మేరకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
జిల్లాలో అన్నిరకాల పంటలు కలిపి 5,90,263.2 ఎకరాలు సాధారణ సాగుగా ఉంది. ప్రస్తుత ఖరీఫ్‌లో 5,30,440.3 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు 5,27,698.1 ఎకరాలు ఈ-క్రాప్‌లో (99.48 శాతం) నమోదయ్యాయి. ఈ-క్రాప్‌లో నమోదైన పంటలన్నింటికీ సాధారణ పంటల బీమా వర్తిస్తుంది. దీంతో కరువు, తుపాన్ల సమయంలో పంటలకు నష్టం వాటిల్లితే ఆ మేరకు పరిహారం లభిస్తుంది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ఈ-క్రాప్‌ ధ్రువీకరణే కీలకమైంది. శనివారం ఒక్కరోజే మిగిలి ఉంది. ఇంకా 2,2742.2 ఎకరాల విస్తీర్ణం మేర నమోదు కావాల్సి ఉంది. ఈ-క్రాప్‌లో నమోదు కాకుంటే రైతులు అన్ని రకాలుగా నష్టపోయే అవకాశముంది. వలస వెళ్లిన కుటుంబాలకు చెందిన కొందరు తమ పేర్లను నమోదు చేయించుకోలేదని తెలుస్తోంది. కొన్నిచోట్ల సర్వే నంబర్లు సరిపోక నమోదు కాలేదు. దేవాదాయ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతుల భూముల వివరాలూ నమోదు కాలేదని తెలుస్తోంది.
గ్రామాల్లో జాబితాల ప్రదర్శన
నమోదుకు శనివారం వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ-క్రాప్‌ జాబితాలను అన్ని సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. వీటిపై వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి, సరిచేయనున్నారు. అభ్యంతరాలను తెలిపేందుకు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాల ఆధారంగా నమోదు కాని పంటల వివరాలను ఈ-క్రాప్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు.
వర్షాభావ పరిస్థితులతో పంటలు వేయని రైతులు
పంటలు వేస్తేనే ఈ-క్రాప్‌లో నమోదవుతుంది. రైతులకు ఆ మేరకు ప్రయోజనాలు దక్కుతాయి. వర్షాభావ పరిస్థితులతో చాలా గ్రామాల్లో పంటలే వేయని పరిస్థితులు ఉన్నాయి. ఒక్క వరి పంటనే తీసుకుంటే, గతేడాది 5,19,120 ఎకరాల్లో (101శాతం) వేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 4,80,572.5 ఎకరాల్లో వరి సాగైంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 38,547.5 ఎకరాల్లో రైతులు పంటలు వేయలేదు. పంటలు వేయలేదు కాబట్టి వీరికి ఎటువంటి పంటల బీమా వర్తించదు. పంటలు వేసిన అనంతరం నష్టం వాటిల్లిన మేరకే పంటల బీమా ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి ప్రయోజనాలు వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు.
రైతులకు తీవ్ర అన్యాయం
             పంటలు సాగు అయితేనే ఈ-క్రాప్‌లో నమోదవుతుంది. కరువు, వర్షాభావ పరిస్థితులతో వేలాది ఎకరాల్లో రైతులు ప్రస్తుత ఖరీఫ్‌లో పంటలు వేయలేదు. ఈ-క్రాప్‌లో నమోదైన వారికే పంటల బీమా, ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయని ప్రభుత్వం చెప్తుండడంతో, రైతులకు తీవ్ర అన్యాయం చేకూరుతుంది. పంటలు వేయకపోవడంతో నష్టపోయిన ఆదాయం మేరకు వారికి పరిహారం ఇవ్వాలి.
- కె.మోహనరావు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి
పంటలు వేయని వారికి బీమా వర్తించదు

             పంటలు వేసిన తర్వాత నష్టపోతేనే బీమా వర్తిస్తుంది. పంట వేయనప్పుడు ఎటువంటి ఖర్చు ఉండదు. పంటలు వేసిన తర్వాత నష్టపోయిన వాటికే కేంద్ర ప్రభుత్వం బీమా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ-క్రాప్‌లో నమోదు కాని పంటల వివరాలను రైతులు వెంటనే నమోదు చేసుకోవాలి. అభ్యంతరాలను తెలియజేస్తే వాటిని సరిచేస్తాం.
- కె.శ్రీధర్‌, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు