
ముంబయి : కరోనా క్లిష్ట పరిస్థితుల్లో నిస్సహాయులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారిన సోనూసూద్ ను కలిసేందుకు అర్మాన్ అనే అభిమాని సాహసం చేశాడు. సైకిల్ పై బీహార్ నుండి ముంబయి కి బయలుదేరాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూ భావోద్వేగానికి గురయ్యారు. అభిమాని చూపిస్తున్న ప్రేమకు కంటతడి పెట్టుకున్న సోనూసూద్.. అతడికి సాయం చేయడం కోసం సన్నాహాలు చేశారు. మార్గమధ్యంలో అతడితో సంప్రదింపులు జరిపి, విమానంలో ముంబయి కి వచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని సోనూసూద్ స్వయంగా చెప్పారు.
' నేను అర్మాన్ తో మాట్లాడాను. అతడు వారణాసి చేరుకున్నాడు. సైకిల్ పై బీహార్ నుండి రావడం మంచిది కాదని చెప్పా. విమానంలో ముంబయి కి వచ్చేలా ఒప్పించాను. అతడి రాకపోకలకు అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. అర్మాన్ కు నేనంత ప్రత్యేకమైనప్పుడు.. అతడి రాకను నేను ఇంకా ప్రత్యేకం చేస్తా. సైకిల్ కూడా విమానంలో వస్తోంది. వెళ్లేటప్పుడు కూడా దాన్ని తిరిగి పంపిస్తా. ఓసారి నన్ను బీహార్ కు రావాలని అక్కడి ప్రజలు అడుగుతున్నారు. దానికి కాస్త సమయం పడుతుంది ' అని సోనూసూద్ పేర్కొన్నారు.
సోషల్ మీడియా అనలైటికల్ సంస్థ నివేదికలో సోనూ కు చోటు..
మరోవైపు.. పేదలకు అండగా నిలిచి మానవతాదృక్పథాన్ని చాటుకున్న సోనూసూద్ సోషల్ మీడియా అనలైటికల్ సంస్థ అక్టోబర్ కు సంబంధించి ప్రకటించిన నివేదికలో.. అన్ని విభాగాల్లో కలిపి నాలుగో స్థానంలో నిలిచారు. రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, సినిమాలు ఇలా వివిధ రంగాల్లో కలిపి టాప్ సెలిబ్రిటీస్ ఎవరోనని శోధించగా.. సోనూ అందులో చోటు దక్కించుకున్నారు. అగ్ర స్థానంలో మోడి, రెండో స్థానంలో రాహుల్ గాంధీ, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉండగా, 2.4 మిలియన్ల ప్రస్తావనలతో నాలుగో స్థానంలో సోనూసూద్ ఉన్నారు.