అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కంటెంప్ట్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దష్టి పెట్టాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో కంటెంప్ట్ కేసులపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ తో పాటు పెనుగొండ సబ్ కలెక్టర్ నిషాంతి, అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్య, డిఆర్‌ఒ గాయత్రి దేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ శాఖ, డ్వామా, సివిల్ సప్లైస్, డిపిఒ తదితర శాఖలకు సంబంధించి 67 కంటెంప్ట్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి సంబంధించి ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయారిటీ ప్రకారం కేసులను పరిష్కరించాలని, ఎలాంటి ఆలస్యం జరగకుండా చూసుకోవాలన్నారు. వకాలత్ ఫైల్ చేయాల్సిన కేసులకు సంబంధించి ఈనెల 6వ తేదీ శనివారం లోపు వకాలత్ ఫైల్ చేయాలన్నారు. కౌంటర్ ఫైల్ చేయాల్సిన కేసులకు సంబంధించి 20వ తేదీ లోపు కౌంటర్ ఫైల్ పూర్తిచేయాలన్నారు. డ్వామా కేసులకు సంబంధించి ఈ నెలాఖరులోపు కేసులను డిస్పోజ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత అధికారులంతా బాధ్యత తీసుకుని కంటెంప్ట్ కేసుల పరిష్కారానికి కషి చేయాలన్నారు. ఈనెల 23వ తేదీన మరోసారి కంటెంప్ట్ కేసులపై సమావేశం నిర్వహిస్తామని, అప్పటిలోపు వకాలత్, కౌంటర్ ఫైల్ దాఖలు చేయడం పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పీడీ విజయలక్ష్మి, డిఎంఅండ్‌హెచ్‌ఒ కామేశ్వర ప్రసాద్, కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ వసంతలత, డిపిఒ పార్వతి, ఆర్డీవోలు గుణభూషణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రామ్మోహన్‌తో పాటు తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గంధం చంద్రుడు