Sep 20,2021 07:13

ఇస్మార్ట్‌ గర్ల్‌గా తెలుగు జనాలకు గుర్తుండిపోయిన హీరోయిన్‌ నభా నటేష్‌. రామ్‌తో ఓ రేంజ్‌ మాస్‌గా యాక్ట్‌ చేసిన ఆమెకు ఆ తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ పడలేదు. త్వరలో రిలీజ్‌ కాబోతున్న మాస్ట్రోతో సూపర్‌ సక్సెస్‌ గ్యారంటీ అంటున్నారు నభా. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ నెల 17న డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల సందర్భంగా నభా నటేష్‌ పంచుకున్న ముచ్చట్లు...

పేరు : నభా నటేష్‌
పుట్టిన తేదీ : డిసెంబర్‌ 11, 1995.
పుట్టిన ప్రాంతం : శృంగేరీ, కర్ణాటక
నివాస ప్రాంతం : బెంగళూరు, హైదరాబాద్‌
చదువు : కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌
ఇష్టమైన నటులు : పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌
తల్లిదండ్రులు : నటేష్‌, భాగ్యలక్ష్మి
సోదరుడు : నౌవుష్‌ చక్రవర్తి


'నన్ను దోచుకుందువటే!' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది నభా నటేష్‌. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. డైనమిక్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ నటించిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో నభా నటించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలంగాణ యాసలో నభా నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. దీంతో ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. నితిన్‌కి జోడీగా నటించిన 'మ్యాస్ట్రో' ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం హిందీ మూవీ 'అంధాధున్‌'కు రీమేక్‌. ఇందులో తమన్నా భాటియా నెగెటివ్‌ పాత్రలో కనిపించనుంది. మాతృకతో పోలిస్తే తెలుగు వెర్షన్‌లో దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా మార్పులు చేశారు. స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. గత చిత్రాలకు భిన్నంగా నా పాత్ర చిత్రణ, లుక్‌ నవ్యరీతిలో ఉంటాయి. అంధుడిగా నితిన్‌ క్యారెక్టర్‌ విభిన్నంగా సాగుతుంది. పాత్రలో పరిపూర్ణత కోసం చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ నటించాడు.
 

కెరీర్‌లో తొలి రీమేక్‌..!
నా కెరీర్‌లో తొలి రీమేక్‌ ఇది. నా క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు? ఒరిజినల్‌తో పోల్చుతారా? లేదా? అనే సందేహాలున్నాయి. హిందీలో రాధికా ఆప్టే నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ స్థాయిలో నేను నటించగలనా అని భయపడ్డాను. రీమేక్‌లో నటించే అవకాశం రాగానే మళ్లీ మాతృకను చూడకూడదని నిర్ణయించుకున్నా. ఒరిజినల్‌ పాత్ర ప్రభావం లేకుండా నా శైలిలో పాత్రకు న్యాయం చేశాను. వెబ్‌ సీరీస్‌లోనూ నటించాలనుంది. మంచి కథలు వస్తే వెబ్‌ సిరీస్‌ చేయడానికి నాకు అభ్యంతరం లేదు. సినిమాలు చేస్తూనే అవి కూడా చేస్తాను. ఎక్కడైనా సరే వైవిధ్యమైన పాత్రలు మాత్రమే చేయాలని ఉంది. రొటీన్‌ పాత్రలకు పరిమితమై పోకుండా అన్ని జోనర్స్‌లో సినిమాలు చేయాలనుంది. తెలుగులో అభినయానికి ప్రాధాన్యమున్న మంచి పాత్రలు వరిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.
వైవిధ్యతకే ప్రాధాన్యం ఇస్తా..
'కమర్షియల్‌ సినిమాల్లోనూ వైవిధ్యత, ఆసక్తి కలబోసిన పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రతి సినిమాలో కొత్తదనాన్ని కనబరిచే అవకాశం దొరుకుతుంది. రొటీన్‌ పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదు. తెలుగులో ఇప్పటివరకూ ఐదు సినిమాలు మాత్రమే చేశాను. భవిష్యత్తులో తప్పకుండా మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక కథాంశాల్లో నటిస్తా. ప్రస్తుతం కొన్ని సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లనూ అంగీకరించాను. నటిగా నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను. సినిమాలో కమర్షియల్‌ విలువల కంటే కంటెంటే ప్రధానమని నేను నమ్ముతాను. కథానాయికగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి విభిన్నమైన, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ వచ్చాను. మున్ముందూ అదే పంథాలో వెళ్తూ, మూసధోరణికి దూరంగా, భిన్నంగా.. నటనకు ఆస్కారమున్న పాత్రలు పోషిస్తాను. ఈ చిత్రం కథ విన్నప్పుడు 'అంధాధున్‌'లో రాధికా ఆప్టేలా చేయగలనా అనిపించింది. అయితే, సినిమా ఒప్పుకొన్నాక 'అంధాధున్‌' చూడలేదు. ఆ సినిమా ప్రభావం నాపై పడకూడదని అనుకున్నా. నా శైలిలో నటించా. ఈ సినిమాలో నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. నేను బెంగళూరులో ఉంటున్నాను. రావడం, వెళ్లడం.. ఈ కరోనా నిబంధనలు.. ఇలా టైం కుదరలేదు. అందుకే డబ్బింగ్‌ చెప్పలేకపోయాను. తదుపరి చిత్రాల్లో కచ్చితంగా డబ్బింగ్‌ చెబుతా!' అని నభా నటేశ్‌ అన్నారు. తన తదుపరి చిత్రాలకు సంబంధించిన వివరాలు త్వరలో దర్శక-నిర్మాతలు వెల్లడిస్తారని సెలవిచ్చింది.