Oct 28,2021 19:54

పుట్‌పాత్‌ల మీద, రోడ్డు మీద పళ్లు అమ్ముకునే వాళ్లు మనకు రోజూ కనపడుతూనే ఉంటారు. కrర్నాటకకు చెందిన ఓ పెద్దాయన కూడా అలాగే బుట్టలో కమలా పళ్లు అమ్ముకుంటూ జీవించేవాడు. అయితే అందరిలా అతను సాధారణ వ్యక్తి కాదు. అక్షరం విలువ తెలిసిన మనిషి. అందుకే పండ్లు అమ్మగా వచ్చిన డబ్బుల్లో కొంతభాగం దాచి, దాతల నుంచి మరికొంత సేకరించి వరుసగా స్కూళ్లను స్థాపిస్తున్నాడు. అతని సేవానిరతిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 8 నవంబరు 2021న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అతనికి అవార్డు ప్రదానం జరగబోతోంది. అతని పేరు హజబా (55). కర్నాటకలో హరేకాల్‌ గ్రామంలో నివసిస్తున్నాడు.
నిస్వార్ధ సేవకు నిలువెత్తు రూపం హజబా. 'ఈ పద్మశ్రీ అవార్డు నాకు మాత్రమే దక్కిన గౌరవం కాదు, నా స్కూలుతో పాటు దాని స్థాపనకు, అభివృద్ధికి సహాయం చేసిన వేలాదిమంది వ్యక్తులకు దక్కాలి' అంటాడు ఎంతో వినమ్రంగా. ఇప్పుడు ఆ స్కూలుకు హరేకాల్‌ గ్రామం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు. లాక్‌డౌన్‌లో స్కూలు మూతబడి ప్రాంగణమంతా చెత్తాచెదారంతో నిండివుంటే తానే స్వయంగా శుభ్రం చేసేవాడు. అదేమని ఎవరైనా అడిగితే 'బడులు తెరుచుకుని  పిల్లలంతా ఎప్పుడైనా వస్తారు. అందుకే పాఠశాలను సిద్ధం చేస్తున్నాన'ని సమాధానం చెప్పేవాడు.

కమలాలు అమ్మి... బడులు స్థాపించాడు...
ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాల వరకు స్కూళ్లు స్థాపిస్తూ పోతున్న ఈ పెద్దాయనకు సొంతంగా ఓ చిన్న ఇల్లు కూడా లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. స్కూలు ఎందుకు నిర్మిస్తున్నావని అడిగినప్పుడు 'ఒకరోజు నేను మంగుళూరు మార్కెట్లో కమలాలు అమ్ముతున్నాను. ఓ జంట నా దగ్గరగా వచ్చి కన్నడలో అడ్రస్‌ అడుగుతున్నారు. నేనేమో స్కూలుకు వెళ్లలేదు. నాకు ఆ భాష రాదు. దీంతో నేను వారికి స్థానికంగా మా సామాజిక వర్గం మాట్లాడే తులు, బేరీ (దక్షిణ కన్నడ ప్రాంతంలో, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ముస్లిం సామాజిక వర్గం వాడే భాష) భాషల్లోనే చెప్పగలనని చెప్పాను. వారు నిరాశతో వెనుదిరిగారు. ఆ సంఘటన నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. మొట్టమొదటిసారి నేను కన్నడ నేర్చుకొని ఉండాల్సిందనుకున్నాను. నాకులాగే నా సామాజిక వర్గంలో కూడా చాలామంది స్థానిక భాష తప్ప మరే ఇతర భాషపై పట్టు లేదు. దీంతో వారందరికీ ఉపయోగపడేలా ఓ స్కూలు నిర్మించాలనుకున్నాను. కాని నాకు దానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే అప్పటికే మా గ్రామానికి చెందిన న్యూ పడ్పు ప్రాంతం త్వాహా జుమ్మా మసీదులో పని చేస్తుండేవాడిని. అక్కడి పెద్దలతో నా ఆలోచన పంచుకున్నాను. వారంతా సానుకూలంగా స్పందించి నిధులు సమకూర్చిపెట్టారు. అలా 1994లో 'రవలాతుల్‌ ఉలెమా మదర్శా' స్థాపించాను' అంటూ తన కథ చెబుతాడు హజబా.
ముస్లిం సామాజిక వర్గం నుంచి వచ్చిన పిల్లలు ఆ మదర్సాలో విద్య నేర్చుకునేవారు. ఆ తరువాత చాలా తక్కువ కాలంలోనే హజబా ఆ మసీదు కమిటీకి ట్రెజరర్‌గా నియమితుడయ్యాడు. అయితే అతని ప్రయాణం అంతటితో ఆగలేదు. 5వ తరగతి దాటి చదవాలనుకునే బాలికలు, ఇతర సామాజిక వర్గాల్లోని పిల్లల చదువు కోసం నిరంతరం ఆలోచించేవాడు. కన్నడ మీడియంలో స్కూలు స్థాపించాలని కలలు కన్నాడు. మదర్సాలోనే మీడియం ప్రారంభించాలనుకుని అధికారులను సంప్రదించాడు కూడా. అయితే మదర్సాలో అరబిక్‌ మాత్రమే ఉంటుందని వేరే భాష ప్రవేశపెట్టే వీలులేదని చెప్పడంతో మరోచోట స్కూలు స్థాపించాలనుకున్నాడు. ఇంటింటికీ తిరిగి నిధులు సేకరించాడు. స్థలం అనుమతుల కోసం అధికారుల చుట్టూ కొన్ని వేల సార్లు తిరిగాడు. వెళ్లిన ప్రతిచోటా అతనికి అవమానాలే ఎదురయ్యేవి. ఒక్కోసారి కొంతమంది పావలా, అర్ధ చేతిలో పెట్టి బయటికి గెంటేసేవారు. తన లక్ష్యం చెదిరిపోయేంత స్థాయిలో అతనిని అవమానించారు. మరెవరైనా అయితే అంతటితో ఆగిపోయేవారేమో. హజబా అలా కాదు. ఎలాగైనా స్కూలు నిర్మించాలను పట్టుదలతో ఉండేవాడు. తన దగ్గర కూడబెట్టుకున్న సొమ్ముతో 1999లో 40 గజాల భూమి కొన్నాడు. అతని సంకల్పానికి ఆ తరువాత ఎంతోమంది దాతలు ముందుకు వచ్చారు. వారి సాయంతో అక్కడే ఒక ఎకరా భూమిని సొంతం చేసుకున్నాడు. చిట్టచివరికి 2000లో స్కూలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రయాణంలో అతన్ని అవమానించిన వారితో పాటు తన సంకల్పాన్ని గౌరవించి ప్రోత్సహించిన వారు కూడా ఉన్నారు. అలా 2001 జూన్‌ నాటికి 8 తరగతి గదులు, రెండు మరుగుదొడ్లతో స్కూలు నిర్మాణం పూర్తయింది. ఎంతో అట్టహాసంగా ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఆ క్షణం హజాబా కళ్లు నీళ్లతో నిండివున్నాయంటారు అతన్ని దగ్గరగా చూసినవారు. బెంచీలు, బళ్లలు, బోర్డులు స్కూలుకు కావాల్సిన మౌలిక వసతులన్నీ దాతల సహాయంతో సమకూర్చారు. ప్రస్తుతం 91 మంది విద్యార్థులు అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల నిర్మించాలనే అతని కల నెరవేరింది కాని హైస్కూలు స్థాపన కోసం మరో కల అతని ఖాతాలో చేరిపోయింది. దాని కోసం మళ్లీ ప్రయాణం ప్రారంభించాడు. 2012 నాటికి ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత తరగతి విద్యార్థుల కోసం మరో బిల్డింగ్‌ నిర్మించాడు. రాణీ అబక్కా, కల్పనా చావ్లా, స్వామీ వివేకానంద పేర్లతో కొలువుదీరిన ఆ తరగతి గదులు విద్యార్థులను అంతర్లీనంగా ప్రభావితం చేస్తున్నాయి. పరోపకారానికి ఇంతకుమించిన ఉదాహరణ మరొకటి ఉండదేమో..!

కమలాలు అమ్మి... బడులు స్థాపించాడు...