Jan 12,2021 21:15

ప్రజాశక్తి-కృష్ణా ప్రతినిధి : * కృష్ణా జిల్లా డోకిపర్రులో 1,300 ఎకరాల్లో వరిని పండించారు. ఇప్పటి వరకు 500 ఎకరాల్లో వరి కుప్పల నూర్పిడి పూర్తయింది. ఈ గ్రామానికి చెందిన కౌలు రైతులు కె.సుబ్రహ్మణ్యం 15 ఎకరాల్లోనూ, ఇస్తారపు మురళి పది ఎకర్లాల్ల్లోనూ, చలపాటి శోభన్‌బాబు ఆరు ఎకరాల్లోనూ వరిని సాగు చేశారు. నెల రోజుల నుంచి ధాన్యం విక్రయించేందుకు రైతు భరోసా కేంద్రాలు, మిల్లర్ల చుట్టూ తిరుగుతున్నారు. బస్తా రూ.900 నుంచి రూ.1100 లోపు మాత్రమే మిల్లర్లు అడగడంతో ఇంటి సమీపంలోని ఖాళీ స్థలం వద్ద సంచుల్లో నిల్వ ఉంచారు.

* కౌతవరం గ్రామానికి చెందిన చాపరాల జగన్మోహనరావు 15 ఎకరాల్లో పండించిన ధాన్యం, చిట్టిబమ్మ అశోక్‌ పండించిన ఆరు ఎకరాల్లోని ధాన్యం నెల రోజులుగా కళ్లాల్లోనే నిల్వ ఉన్నాయి.
ఈ రెండు గ్రామాలూ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన మంత్రి నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు.

నివర్‌ తుపాను వల్ల తడిచి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. తడిచిన ధాన్యం కొనేవారులేక కళ్లాల్లో రాశులుగా, ఇళ్ల వద్ద సంచుల్లో రైతులు నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. రైతులను మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. 'ఎ' గ్రేడ్‌ ధాన్యం బస్తా (75 కిలోలు) రూ.1,416 మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించగా, మిల్లర్లు రూ.900 నుంచి రూ.1,100 మాత్రమే ధర చెల్లిస్తూ అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకుంటున్న కొందరు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తుపానుకు కృష్ణా జిల్లాలో 1.65 లక్షల ఎకరాల్లో వరి నేల కొరిగింది. 82,500 ఎకరాల్లో కోత కోసి పనలపై ఉన్న వరి నీటిలో తడిచిపోయాయి. మొత్తం 2,47,500 ఎకరాల్లో వరి పొలాలకు నష్టం వాటిల్లింది. ధాన్యం సేకరణకు నూటికి ఐదు శాతం మాత్రమే తాలు, రంగు మారిన ధాన్యం, మట్టి గడ్డలు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం పది శాతానికి సడలించింది. గత పెథారు తుపాను సమయంలో నాణ్యత విషయంలో 20 శాతం వరకు సడలింపు ఇచ్చి సేకరించారు. అప్పుడు సేకరణ కేంద్రాల్లోనే ధాన్యం నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి ధర నిర్ణయించడంతో రైతులకు ఊరట కలిగింది. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం సేకరిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నా, ఆచరణలో మిల్లర్లు నిర్ణయించిన ధరే రైతుకు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, జిల్లా అధికారులు అవసరమైన మేర నిబంధనలు సడలించి తడిచిన ధాన్యం పూర్తి స్థాయిలో సేకరించి తమకు ఊరట కలిగించాలని రైతులు కోరుతున్నారు.