Nov 30,2020 22:09

వెలవెలబోతున్న రైతు బజారు

ప్రజాశక్తి- పలాస : పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో శాశ్వత రైతుబజారు ఏర్పాటు కలగానే మిగిలింది. జిల్లాలో అభివృద్ధి చెందుతున్న పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు అనుకొని ఉద్దాన ప్రాంతంలో రైతులు పండించే కూరగాయాలను తెచ్చి బస్టాండ్‌ ప్రాంతంలోనే వ్యాపారం చేసుకుంటూ జీవించే పరిస్థితులు నెలకొన్నాయి. గత పాలనలో శాశ్వత రైతుబజారు ఏర్పాటు చేసేందుకు పాత బాలుర వసతి గృహం ప్రాంతాన్ని గుర్తించి పనులు ప్రారంభించడంతో కొన్ని కారణాలతో నిలిచిపోయాయి. వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలంలో 5 నెలల క్రితం తాత్కాలిక రైతుబజారు ప్రారంభించారు. ప్రాంతంలో కొనుగోలు అమ్మకాలు జరగకుండా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బోర్డు మాత్రమే మిగిలింది. ఉద్దాన ప్రాంతాల నుంచి రైతులు తీసుకొస్తున్న తమ పంటలను కాశీబుగ్గ బస్టాండ్‌ ప్రాంతంలో చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపడుతున్నారు. తాత్కాలిక రైతుబజారు వైపు కనీసం వెళ్లకపోవడం విశేషం. మున్సిపాలిటీ అధికారులు బస్టాండ్‌లో ఏర్పాటు చేస్తున్న కాయగూర దుకాణాలు తొలగించి రైతుబజారు ప్రాంతంలో అమ్మకాలు నిర్వహించేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక స్థానంలో శాశ్వత రైతుబజారు ఏర్పాటు చేసేందుకు అధికారులు చొరవ చూపడం లేదు. దీనివల్ల మంత్రి అప్పలరాజు అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. పలాస కాశీబుగ్గ ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని గుర్తించి ఆక్రమణలు తొలగించి ఆయా భూముల్లో రైతుబజారులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే కొనుగోలుదారులకు అనువుగా ఉంటుందని, ఆ దిశగా అధికారులు అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు.