Nov 27,2020 16:37

విజయనగరం : జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌కు మేన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు లభించింది. ఆయన చేసిన సేవలను గుర్తించిన ఢిల్లీకి చెందిన ఇండియన్‌ ఎచీవర్స్‌ ఫోరమ్‌ ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. దేశంలో వివిధ రంగాల్లో సుదీర్ఘకాలంపాటు ఉత్తమ సేవలందించిన వారిని గుర్తించి, ఇండియన్‌ ఎచీవర్స్‌ ఫోరమ్‌ గత 20 ఏళ్లుగా ఈ అవార్డులను బహూకరిస్తోంది. ఇప్పటికే జిల్లాకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులను సాధించిపెట్టిన కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌, మరో ప్రముఖ పురస్కారానికి ఎంపిక కావడంతో ఆయనకు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.

జిల్లాకు వరం కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ : ఉన్నతాధికారుల అభినందనలు
డాక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌ జిల్లా కలెక్టర్‌గా రావడం జిల్లాకు వరం అని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ జిసి.కిశోర్‌కుమార్‌ కొనియాడారు. మేన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పురస్కారానికి ఎంపికైన కలెక్టర్‌ను పలువురు ఉన్నతాధికారులు, పాత్రికేయులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది శుక్రవారం శాలువలతో సత్కరించి, పూలగుచ్ఛాలతో అభినందించారు. ఈ సందర్భంగా జెసి కిశోర్‌ మాట్లాడుతూ, మన కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ జిల్లాను అన్నివిధాలా అభివద్దివైపు నడిపిస్తూ, ఇప్పటికే పలు అవార్డులను సాధించిపెట్టారని అన్నారు. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఘనత ఆయనకే దక్కిందని ప్రశంసించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి డి.రమేష్‌, కెఆర్‌ఆర్‌సి ఉప కలెక్టర్‌ కెబిటి సుందరి, జిల్లా విపత్తుల నివారణాధికారి బి.పద్మావతి, సిపిఓ జె.విజయలక్ష్మి ప్రశంసించారు.

సానుకూల దృక్ఫథం, సమిష్టి కృషే కారణం : హరి జవహర్‌లాల్‌
సానుకూల దృక్ఫథం, సమిష్టి కృషే తన విజయానికి కారణమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌ పేర్కొన్నారు. తనకు మేన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు రావడం పట్ల ఆయన స్పందిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. సృజనాత్మకంగా పనిచేసేందుకు అవకాశం రావడం కూడా ఒక వరమని, దానిని విజయనగరం జిల్లా తనకు కల్పించిందని చెప్పారు. మనస్ఫూర్తిగా పనిచేసుకుపోవడం, తనకు జిల్లా యంత్రాంగం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందడం తన విజయాలకు కారణాలని పేర్కొన్నారు. తాను ఎన్నడూ అవార్డులను ఆశించలేదని, అంకితభావం, చిత్తశుద్దితో ప్రణాళికాబ్దంగా పనిచేయడం వల్లే, అవార్డులు వాతంటత అవే వస్తున్నాయని చెప్పారు.