Jan 25,2021 23:28

రాజమహేంద్రవరంలో సమావేశంలో పాల్గొన్న నేతలు

ప్రజాశక్తి-యంత్రాంగం : వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 26న ప్రజా సంఘాలు, రైతు సంఘాలు చేపట్టిన రైతు కవాతుకు మద్దతుగా సోమవారం జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేశారు. సభలూ, సమావేశాలూ నిర్వహించారు. రాజవొమ్మంగిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లోతా రామారావు దుర్గా నగరంలో కాళ్ల రాజు బాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు కె.సూరిబాబు, పి.పాపారావు, రామరాజు, గంగరాజు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన సమా వేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి, సిఐటియు జిల్లా కార్యదర్శి, ఎన్‌ఎస్‌ఎ జిల్లా కార్యదర్శులు పి.తులసి, ఎస్‌.ఎస్‌.మూర్తి, బి.పవన్‌ మాట్లాడారు. కిసాన్‌ పెరేడ్‌కు ప్రజాంసఘాలు సంపూర్ణ మద్దతు తెలిపారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుంచి కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌.ఎఫ్‌.ఐ నగర కార్యదర్శి ఎన్‌.రాజా, సిఐటియు నాయకులు బి.పూర్ణిమరాజు, ఐ.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కూనవరంలో మార్త శ్రీరామ్మూర్తి భవనంలో తలగాని నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో మాజీ ఎంపిపి, పార్టీ మండల కార్యదర్శి కొమరం పెంటయ్య, సీనియర్‌ నాయకులు మేకల నాగేశ్వరరావు మాట్లాడారు. 26న చట్టి నుంచి చింతూరు ఐటిడిఎ వరకు ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. పెద్దాపురంలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రైతు సంఘం నాయకులు దేవళ్ల గోపాలం, గడ్డం రాము, చీపురుపల్లి సింహాచలం, కరక బాబ్జి, గడిగట్ల సత్తిబాబు తెలిపారు. వరహాలయ్యపేట లోని యాసలపు సూర్యారావు భవనం నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు.