Nov 21,2020 12:33

గోవా : కరోనా మహమ్మారి విరామం అనంతరం ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) రూపంలో దేశంలో మెగా టోర్నీ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో ఎటికెతో జతకట్టి తొలిసారిగా అడుగుపెట్టిన మోహన్‌ బగాన్‌ విజయంతో టోర్నీని ఆరంభించింది. శుక్రవారం జరిగిన ఏడో సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఎటికె మోహన్‌ బగాన్‌ 1-0 తేడాతో కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సిని ఓడించి శుభారంభం చేసింది. కెప్టెన్‌ రారు కృష్ణ (67వ నిమిషంలో) గోల్‌ కొట్టాడు. మ్యాచ్‌ సాగుతున్నా కొద్ది హోరాహోరీగా తలపడడంతో తొలి అర్ధ భాగంలో గోల్స్‌ నమోదు కాలేదు. రెండో అర్ధ భాగంలో జోరు పెంచిన మోహన్‌ బగాన్‌ ఫలితం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి మంచి దూకుడు మీద కనిపించిన ఫార్వర్డ్‌ రారు కృష్ణ గోల్‌తో ఆకట్టుకున్నాడు. అప్పటికే రెండు సార్లు గోల్స్‌ చేసే అవకాశం చేజారడంతో ఈ ప్రయత్నాన్ని వదులుకోవద్దనే పట్టుదలతో కనిపించిన అతను బంతిని అందుకోగానే దాన్ని గోల్‌కీపర్‌ కుడివైపుగా లోపలికి పంపించాడు. చివరి వరకూ స్కోరు సమం చేసేందుకు కేరళ బ్లాస్టర్స్‌ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు మోహన్‌ బగాన్‌ 1-0 స్కోరుతో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో బగాన్‌కు మూడు పాయింట్లు లభించాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌-ముంబై సిటీ తలపడతాయి.

కేరళ బ్లాస్టర్స్‌పై మోహన్‌ బగాన్‌ విజయం!