Jan 28,2021 15:11

బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య మళ్లీ సరిహద్దు చిచ్చు రాజుకుంది. కర్ణాటక సరిహద్దులోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపే విషయంపై కట్టుబడి ఉన్నామని, అలాగే ఆ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ ఉద్ధవ్‌ఠాక్రే ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై కర్ణాటక ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి కేంద్రాన్ని అభ్యర్థించారు.
కర్ణాటక, మహారాష్ట్రాల సరిహద్దు వివాదాలపై రూపొందిన పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఠాక్రే పాల్గొని మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడి బెళగావి పేరు మార్చిందని ఆరోపించారు. సరిహద్దులో ఉన్న ప్రాంతాలను యూటీలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలను కర్ణాటక ప్రభుత్వం తప్పుబట్టింది. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవాడీ స్పందిస్తూ.. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని, తమ రాష్ట్రంలోని కొంతమంది ప్రజలు ముంబయి-కర్ణాటక ప్రాంతానికి చెందినవారేనని, అందువల్ల ముంబయిపై తమకూ హక్కు ఉందని, ఆ ప్రాంతాన్ని కర్ణాటకలో కలపాలని, అప్పటి వరకూ ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నా అంటూ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో ఈ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఇంకా ముదురుతోందనిపిస్తోంది.
అసలు వివాదం ఇదీ..
ఒకప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న బెళగావి తదితర ప్రాంతాలు ఆ తర్వాత మైసూరు రాష్ట్రంలో కలిశాయి. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు మరాఠీనే మాట్లాడతారు. కాబట్టి వాటిని తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్‌ చేస్తోంది. దీనిపై బెళగావి కేంద్రంగా 1948లో ఏర్పడిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి పోరాటం కొనసాగిస్తోంది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు జనవరి 17న ఆ ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు. దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ఏకీకరణ సమితి చేపట్టిన ఆందోళనల్లో 10 మంది మరణించారు కూడా. ఆ తర్వాత 1967 మహజన్‌ కమిషన్‌ నివేదక ప్రకారం బెళగావి తదితర ప్రాంతాలు కర్ణాటకలోనే ఉన్నాయి. ఆ మధ్య ఈ వివాదం కాస్త సద్దుమణిగినట్లే కన్పించినా.. ఇటీవల ఠాక్రే వ్యాఖ్యలతో మళ్లీ వివాదం ప్రారంభమైంది.