Oct 28,2021 07:13

రాష్ట్ర ప్రభుత్వ చోద్యం!..  ఆందోళనలో అన్నదాత

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రాష్ట్రానికి అదనుకు ఎరువుల విడుదలలో కేంద్రం వివక్ష చూపుతుండగా, కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం నిగ్గదీసి ఎరువులను సకాలంలో సాధించే విషయంలో వెనుకంజ వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ వ్యవహారం వలన రైతులకు అవసరానికి ఎరువులు అందని దుస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో డిఎపి, ఎంఒపి కొరత, ఇదే అవకాశంగా ప్రైవేటు కంపెనీలు, డీలర్ల బ్లాక్‌ మార్కెటింగ్‌తో రైతన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
ఖరీఫ్‌ పంటల ఎదుగుదలకు కావాల్సిన పొటాష్‌ ఎరువులు దొరక్క అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం వివక్ష, రాష్ట్రం నిర్లక్ష్యం కారణంగా కీలకమైన అక్టోబర్‌లో ఇప్పటి వరకు వచ్చిన డిఎపి 21 వేల టన్నులు కాగా ఎంఒపి 7 వేల టన్నులు మాత్రమే. ఈ స్టాక్‌ సైతం రబీ కోటా కింద అందినవి. వాటినే ప్రభుత్వం ఖరీఫ్‌ అవసరాలకు పొదుపుగా, అదీ రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) ద్వారా ఆంక్షలు, నియంత్రణల మధ్య అమ్మిస్తోంది.
ఖరీఫ్‌ నుండి అంతే
ఎరువుల కేటాయింపులలో, వాటి విడుదలలో కేంద్రం బిజెపి, బిజెపియేతర రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చూపుతోంది. ఉత్తరాదిలో డిఎపి, దక్షిణాదిలో కాంప్లెక్స్‌ ఎరువులు వాడటం సంప్రదాయంగా వస్తోందన్న సాకుతో ఎపికి డిఎపి, ఎంఒపిల కేటాయింపులకు కోత పెడుతోంది. కేటాయించిన వాటి విడుదలలో వివక్ష చూపుతోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కేటాయించిన ఎరువులనైనా సకాలంలో విడుదల చేయించుకునే విషయంలో రాష్ట్ర సర్కారు విఫలమవుతోంది. పలు రాష్ట్రాలు తమ ఇద్దరు ముగ్గురు ఉన్నతాధికారులను ఢిల్లీలో మోహరించి ఎరువులను విడుదల చేయించుకుంటుండగా మన ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయట్లేదని ఆరోపణలొస్తున్నాయి. మన కోస్తా తీరంలో విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం తదితర పోర్టులకు వచ్చే దిగుమతులపై ఒక కన్నేసినా సరిపోతుందని చెబుతున్నారు. మన దగ్గరే కోరమండల్‌, నాగార్జున వంటి ప్రైవేటు కంపెనీల ఉత్పత్తి కేంద్రాలున్నాయని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేని కారణంగానే ఎరువుల కొరత తలెత్తుతోందంటున్నారు. అందుకు ఖరీఫ్‌నే ఉదాహరణగా పేర్కొంటున్నారు. సీజన్‌లో డిఎపి అవసరం 2.50 లక్షల టన్నులు కాగా సెప్టెంబర్‌ 30 నాటికి 2.30 లక్షల టన్నులే వచ్చాయి. అందులో కూడా సుమారు 45 వేల టన్నులు అంతకుముందు ఏడాదికి చెందిన ఓపెనింగ్‌ బ్యాలెన్స్‌ (ఒబి) నికరంగా ఈ ఖరీఫ్‌లో వచ్చింది 1.84 లక్షల టన్నులే. డిఎపి దొరక్క రైతులు అల్లాడుతుంటే, 30 వేల టన్నులు సేల్‌ కాకుండా మిగిలిందని లెక్కలేశారు. ఎంఒపి అవసరం 1.50 లక్షల టన్నులు కాగా 1.42 లక్షల టన్నులను సమీకరించగా, అందులో ఒబి 66 వేల టన్నులు. నికరంగా ఖరీఫ్‌లో వచ్చిన సప్లయి 76 వేల టన్నులు మాత్రమే. ఎంఒపి సైతం 35 వేల టన్నుల ఒబి చూపించారు.
అక్టోబర్‌లో వచ్చింది స్వల్పం
అక్టోబర్‌ 1 నుండి 26 వరకు డిఎపి ఒబితో కలిపి 51 వేల టన్నుల లభ్యత ఉందని పేర్కొనగా వాటిలో 21 వేల టన్నులు సేల్‌ అయ్యాయంటున్నారు. మిగులు 21 వేల టన్నులు. ఒబితో కలిపి ఎంఒపి 42 వేల టన్నుల నిల్వలుండగా 20 వేల టన్నులు సేల్‌ అయ్యాయని, మిగులు 22 వేల టన్నులని లెక్కలేశారు. ఒక వైపు డిఎపి, ఎంఒపిల మిగులు చూపిస్తూ మరో వైపు వాటికి ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్‌లు వాడుకోవాలని చెప్పడంతోనే వాటికి కొరత ఉందని తెలుస్తోంది. కరోనా, అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడం, కేంద్ర పెట్రో వడ్డన మూలంగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. సబ్సిడీతో డిఎపి వాటి కంటే తక్కువ రేటుకు లభిస్తోంది. అందుకే రైతులు డిఎపి వైపు చూస్తున్నారు. ఈ దృష్టితో పొటాష్‌ ఎరువుల కేటాయింపులు, విడుదలపై ప్రభుత్వం సరైన అంచనాతో లేదని, కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదని ఆరోపణలొస్తున్నాయి.