Dec 05,2021 20:48

296వ రోజుకు స్టీల్‌ కార్మికుల దీక్షలు
ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖ) :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 296వ రోజుకు చేరాయి. శనివారం నాటి దీక్షల్లో కర్మాగారం ఎసిఎం, డబ్ల్యుఆర్‌ఎం, రెడ్‌, ఎసిఎస్‌, విఎస్‌జిహెచ్‌, ఎస్‌ఎస్‌డి, ఆగ్రో విభాగాల ఉద్యోగులు పాల్గన్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధులు ఎన్‌.రామారావు, డి.ఆదినారాయణ, వరసాల శ్రీనివాస్‌, కరణం సత్యారావు, జె.రామకృష్ణ మాట్లాడుతూ.. తొమ్మిది నెలలుగా స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోకుండా ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రైవేటీకరణ నుంచి వెనక్కి వెళ్లేది లేదని చెప్పడం దారుణమన్నారు. మరో వైపు బిజెపి ప్రభుత్వం మత రాజకీయం చేస్తోందని విమర్శించారు. భారతదేశం లౌకిక రాజ్యమని, మతం పేరుతో రాజకీయం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ వారు దళితులు, గిరిజనులు, మైనార్టీలపై దాడులు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 8న గాజువాకలో భారీ ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. దీక్షా శిబిరంలో ఆయా విభాగాల నాయకులు వి.రమణ, పి.అప్పలరాజు, మసేనురావు, మహేష్‌, వి.రామకోటేశ్వరరావు, డి.రమేష్‌, జి.ఆనంద్‌ పాల్గొన్నారు.